విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ) ల ఆగడాలు అంతా ఇంతా కావు. ప్రజాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వేళ్లూనుకుని పల్లెలను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్దల ఆగడాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండదు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వీడీసీలకు దాసోహం కావాల్సిందే. వారు చెప్పినట్లు వినాల్సిందే. లేదంటే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసి తమను ఓడగొడతారనే భయం.
అందుకే వారి ఆగడాలకు అడ్డు ఉండదు. పెదరాయుడు తీర్పులకు తిరుగుండదు. తాజాగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్‌గాంలో 70 దళిత కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. డప్పులు కొట్టేందుకు అదనంగా 500 పెంచి ఇవ్వాలన్న దళితుల డిమాండ్ వీరికి నచ్చలేదు. వెంటనే ఈ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న దళిత కూలీలను సైతం తొలగించారు. దీనికి సర్పంచ్ వత్తాసు పలికాడు. సర్పంచులు కూడా వీడీసీలకు దాసోహమై వారిని కాదని ముందుకు పోయే పరిస్థితులు లేవడానికి ఇదో ఉదాహరణ.
వీడీసీ సభ్యులు, సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి దళితులు ధర్నా చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో వీడీసీల ఆగడాలు శృతిమించి పోతుంటాయి. కానీ దీన్ని ఎవరూ ఆపలేరు. దళితుల అభ్యున్నతి కోసమని దళితబంధు ప్రవేశపెట్టి, ఇదో మహా ఉద్యమమని అభివర్ణించిన కేసీఆర్… ఇలా దళితులను పల్లెల్లో ఇంకా బహిష్కరిస్తున్నారన్న విషయం నీకు తెలుసా? వీడీసీల ఆగడాలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు కూడా గజగజ వణుకుతారన్న సంగతి నీ గమనంలో ఉందా?