తెలుగులో క‌థ‌లు దొర‌క‌డం లేదు బ‌హుశా. మ‌న‌వాళ్ల అతి విశ్వాస‌మో.. ప్రేక్ష‌కుల‌పై చిన్న‌చూపో తెలియ‌దు కానీ, హీరోయిక్ పాత్ర‌ల కోసం క‌థ‌ల‌ను అలాగే రాసుకుని ఇలా త‌మ భ‌విష్య‌త్తును కాల‌రాసుకుంటున్నారు. ఓ పూరీ, ఓ వినాయ‌క్‌, ఓ శ్రీ‌ను వైట్ల‌, ఓ బోయ‌పాటి శ్రీ‌ను.. తాజాగా ఆ లిస్టులో కొర‌టాల శివ‌.. వీళ్లంతా ఇప్పుడు అవుట్ డేటెడ్‌. ఇక వీళ్ల నుంచి సినిమాలను ఆశించ‌లేం. మంచి సినిమాలు రాబ‌ట్ట‌లేం. అలా త‌యార‌య్యారు. ఈ సొంతంగా క‌థ‌లు రాసుకునే పాడు అల‌వాటు ఎందుకు ఏమో గానీ, త‌మ మీద త‌మ‌కు అంతటి మితిమీరిన విశ్వాసంతో వేసే అడుగులు ఫ్లాపుల వైపే అడుగులేయిస్తున్నాయి. ఆచార్య సినిమాతో చేతులు మూతులు కాల్చుకున్న కొర‌టాల‌, దేవర క‌థ‌ను సొంతంగా రాసుకుని ఎన్టీఆర్ లాంటి ప్ర‌తిభ గ‌ల నాయ‌కుడు న‌టించినా లాభం లేద‌ని నిరూపించుకున్నాడు. కొర‌టాల ఆది నుంచి సొంతంగా రాసుకుంటూ వ‌స్తున్న క‌థ‌ల్లో వాస్త‌వానికి దీంట్లో కూడా ద‌మ్ములేదు.

అయితే పాట‌లో, ఆ సినిమాలో చిన్న సందేశం పాయింటో ఆ సినిమాలను న‌డిపించాయి. ఈ కోవ‌లోకి వ‌చ్చేవే.. మిర్చి, జ‌న‌తా గ్యారేజ్‌, శ్రీ‌మంతుడు… ఇందులో క‌త ఏదో అనుకుని ఎటో తిరిగి ఎక్క‌డో ముగుస్తుంది. త‌న‌కు తానే క్లారిటీ మిస్ అయి.. క‌థ‌ను అల్లుకుని హీరోల వ‌ద్ద‌కు వెళ్లిన కొర‌టాల పై అంత న‌మ్మ‌కం ఎందుకు పెట్టుకున్నారో ఆ అగ్ర‌హీరోల‌కే తెలియాలి. చిరంజీవి లాంటి హీరొ కూడా కొర‌టాల క‌థ‌కు దొరికిపోయాడు. అడ్డంగా బుక్ అయ్యాడు. తండ్రీకొడుకులు తీసిన ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. క‌థ చెబుతున్న‌ప్పుడే ఆ సినిమా హిట్టు , ఫ‌ట్టు తాలూకు వాస‌న‌లు వీరికి తెలిసిపోవాలి. కానీ అలా తెలుసుకోకే.. ఓ ఆచార్య‌, ఓ ఆరెంజ్‌, ఓ దేవ‌ర‌.. ఇలా ఫ‌ట్టు సినిమాలు వ‌స్తున్నాయి. అభిమానులు కూడా వెర్రి వేలంగా త‌మ అభిమాన హీరో సినిమాపై గంపెడాశ‌లు పెట్టుకోవ‌డం, ఫ్లాప్ టాక్ రాగానే విప‌రీతంగా స్ప‌దించ‌డం త‌మిళ‌నాడు వెర్రి ఇక్క‌డకు కూడా పాకిన‌ట్టు అనిపిస్తుంది.

మొన్న దేవ‌ర ప్రీ రిలీజ్‌లో హోట‌ల్‌ను మొత్తం ధ్వంసం చేసిన వెర్రివేలం ఫ్యాన్స్ ఇవాళ ఎన్టీఆర్ క‌టౌట్‌నే త‌గులబెట్టారు. ఓటీటీల కాలంలో పాన్ ఇండియా సినిమాల యుగంలో, ఇత‌ర భాష‌ల్లో ప్ర‌యోగాల క‌థ‌ల ప్ర‌య‌త్నాల ప‌రుగులో కూడా ఇలా అభిమాన హీరోలంటూ తెగ‌బ‌డి త‌గుల‌బెట్టి, త‌గుల‌బ‌డి….. ఇది పోవాలె. తెలుగులో క‌థ‌లు మారాలె. పాత మూస‌దోర‌ణిలో క థ‌లు రాసుకునే డైరెక్ట‌ర్ల క‌త ఇగ ముగియాలె. కొత్త‌వాళ్ల‌కు చాన్సులు రావాలె. కొత్త ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్టాలె. అది జ‌రిగేనా..?