(దండుగుల శ్రీనివాస్)
పాపం.. నాగార్జున..! వరుసగా ఎదురుదెబ్బలే ఉన్నట్టున్నాయి. హైడ్రా పేరుతో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసింది ప్రభుత్వం. ఇది ఊహించని పరిణామం నాగ్‌కు. తేలు కుట్టిన దొంగలాగే అయ్యిందనుకో ఈ విషయంలో. అక్రమమని చెప్పలేడు. సక్రమమనీ కితాబిచ్చుకోలేడు. జనాల నుంచి కూడా సానుభూతి దొరకలేదు. తీసే సినిమాలు కూడా పెద్దగా ఎవరూ చూడట్లేదు. ఎంచుకున్న కథలలా ఉన్నాయి. ఇక చూడబుద్ది కావడం లేదేమో తెరపై ప్రేక్షకులకు. మరీ టీవీలో బిగ్‌బాస్ 8తో అందరికీ చేరువయ్యేందుకు చూసినా.. ఇక్కడా ఆ వేదిక నాగ్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ గడ్డం అసలే సెట్ కాలేదు.
ఇక వచ్చిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరినీ చూస్తూ ముఖాలు వేలాడేశారు ప్రేక్షకులు. విష్ణుప్రియ ఒకతె కొంచెం అందరికీ తెలిసిన దానిలా ఉంది. ఆదిత్యా ఓంను మరిచిపోయారు. పట్టుకొచ్చారిందులోకి. ఇక దీనిపై ఆసక్తి చాలా మందికి తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ బిగ్‌బాస్‌కు అంత సీన్‌లేదు. నాగ్‌కూ ఏదీ కలిసి రావడం లేదు.