తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు సుమారు 14, 000 మంది ఆర్టీసి కార్మికులు రిటైర్ అయినా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క కొత్త ఉద్యోగం ఇయ్యలేదు సరికదా ఉన్న ఉద్యోగులపైన విపరీతమైన పనిభారం పెంచి వారి ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నది స‌ర్కార్‌. ఎనిమిది గంటల పనిని పదహేను గంటలకుపైగా పెంచినారు.స్పెషల్ ఆఫ్ డ్యూటీలను సింగిల్ క్రూలుగామార్చి బతికుండగా నరకమేంటో చూపిస్తున్నారు. స్టీరింగ్ మీదనే డ్రైవర్లు సీట్లమీదనే కండక్టర్లు కుప్పకూలిపోయే పరిస్థితులు తీసుకువచ్చారు. వందలాదిమంది కార్మికులు పెంచిన పనిభారం తట్టుకోలేక విశ్రాంతి లేక ప్రమాదాలబారిన పడి చనిపోతున్నారు. గుండెనొప్పులకు గురై పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే కొనసాగితే మరిన్ని కొండగట్టులాంటి ప్రమాదాలు చూడాల్సివస్తుందేమో…

రిటైర్ అయిన కార్మికుల భారం మొత్తం ఉన్నవారిపై మోపుతున్నారు. దీనికి తోడు మహాలక్ష్మి స్కీమ్ ( ఫ్రీ బ‌స్సు) తో పెరిగిన రద్దీతో డ్రైవర్ల కండక్టర్ల పరిస్థితి అత్యంత దయణీయమైంది. ఏనాడు సమయానికి ఇంటికి చేరిందిలేదు. గంటల తరబడి ఆలస్యమవుతుంది. రన్నింగ్ టైంని మార్చకుండా గంటల తరబడి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.ఉదాహ‌ర‌ణ‌కు నైజాం నవాబులకాలంలో ఇచ్చిన జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్ వ‌ర‌కు 20 ని.లలో చేరాలి. ఈరోజు ఈట్రాఫిక్ లో ఆర్టీసి బస్సు చేరుతుందా..? ( అన్నీ సర్వీసులకు ఇలాంటి తిప్పలే ఉన్నాయి)
2021 పేస్కేల్ లేదు. పాత పేస్కేల్ వేతనాల బకాయిల విడుదల లేదు. దాచుకున్న సొమ్ముకు లోన్ లు లేవు. గతిలేక ఉద్యోగం చేయడం తప్ప మరేదారిలేకపోయింది కార్మికులకు.

ఇదంతా ఒకవైపు ఉంటే సంస్థలోకి అడ్డగోలుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి కార్పొరేటులకు సబ్సిడీలు ఇచ్చి ఆర్టీసి డిపోలకు డిపోలనే కట్టబెట్టి కొత్త ఉద్యోగాలు లేకుండా అంతా ప్రైవేటుపరం చేయబూనుకొన్నారు. ఒక్క ఎలక్ట్రిక్ బస్సు స్థానంలో 5 డీజీల్ బస్సులు లేదా మూడు సీఎన్‌జీ బస్సులు కొనవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒకటి రూ. 1.80 కోట్లు. ప్రైవేటు వారికి సబ్సిడీలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీల‌కు, రాష్ట్ర సర్కార్ల‌కు ఎందుకీయడంలేదు…? ప్రజల సొమ్ము ప్రైవేటు కార్పోరేటులకివ్వడమేమిటి..? కాలుష్యం పేరుతో కర్రుకాల్చి వాతపెడతారా..? అసలు ఆర్టీసి వెదజల్లుతున్న కాలుష్యం ఎంత అంటే.. ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే 1% కూడాలేదు. 99% ఎవరు మార్చాలి..? పూర్తి కాలుష్యంలో ఫ్యాక్టరీల కాలుష్యం 50% పైగానే ఉంది దీనిని ఎవరు మార్చాలి..?

కాలుష్యం పేరు చెప్పి ఆర్టీసిని కార్పోరేటులకు అప్పజెప్పే పెద్ద కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్న‌ది. దీనికి తానా అంటే తందానా అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలనను గాలికొదిలి కార్పొరేట్‌ పాట పాడుతుండటం గమనార్హం. ఒక్క ప్రైవేటు బస్సు ఆర్టీసిలోకి వస్తే ఆరు ఉద్యోగాలు ఊడతాయి. 3వేల‌ బస్సులు దశలవారీగా తీసుకొస్తామంటే అర్థం 18,000 ఉద్యోగాలు ఊడతాయని. వీరి స్థానంలో కార్పొరేటు వచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను దెబ్బతీసి అంతా ప్రైవేటు ఉద్యోగాలు, వెట్టిచాకిరీ, చాలీచాలని వేతనాలిచ్చి శ్రమదోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆర్టీసిలో ఒక్కో డిపోలో 50% వరకు అద్దె బస్సులున్నాయి. ఈ కార్మికులకు తక్కవ వేతనాలిచ్చి ఎలాంటి సామాజిక భద్రత లేకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. దీనికితోడు ఇంకా ఈ ఎలక్ట్రిక్ బస్సులు చేరితే ఆర్టీసి పరిస్థితి పేరుమాత్రమే ఆర్టీసి… పెత్తనం మాత్రం కార్పొరేట్‌ది అవుతుంది. ఇక కోట్లవిలువ జేసే డిపో గ్యారేజీ స్థలం ప్రైవేటువారికి అప్పజెప్పాలని కుట్ర జరుగుతున్న‌ది. ఇలా కరీంనగర్ , వరంగల్, హైదరాబాదు … అన్నీ రీజియన్ లలో ఇదే పరిస్థితి దాపురించింది. కార్మికులు, కార్మిక సంఘాలు ఈ ప్రమాదాన్ని పసిగట్టాయి. ప్రజలు కూడా ఆలోచించి కార్మికులకు అండగా నిలబడితేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుంది…

ఇలాంటి అక్రమాలు చేయాలనే భావించి గత కేసీఆర్ ప్రభుత్వం అడగడానికి ఎవ్వరూ ఉండొద్దని రాజ్యాంగం ఇచ్చిన కార్మిక సంఘాలను రద్దుచేసింది. ఇష్టారీతిన వ్యవహరించారు. ప్రశ్నించిన వారిని చేయని తప్పులకు, చిన్న చిన్న పొరపాట్ల‌కు అడ్డగోలుగా వందలాదిమందిని సస్పెండ్, రిమూవల్స్ చేశారు. వారి అప్పీళ్లను తిరస్కరించి వారికుంటుంబాలను రోడ్డుకీడ్చారు. మళ్ళీ మా బతుకులు మారతాయని భావించి కొత్త సర్కారుకు ఊతమిస్తే ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారు. ప్రభుత్వం మారింది కానీ గత ప్రభుత్వ విధానాలు మారలేవు. యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. ప్రజాస్వామ్యం పునరుద్దరిస్తామని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం .. ఆర్టీసిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించకపోగా కేసీఆర్ , మోదీ విధానాలను కలగలిపి అవలంభిస్తున్నట్లుగా ఉంది. ప్రజాస్వామికవాదులు ఇట్టి ప్రజావ్యతిరేక విధానాలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసి కార్మికులు కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి సంస్థ పరిరక్షణ , కార్మికుల హక్కుల రక్షణ కోసం జరిపే పోరాటంలో ప్రజలంతా పాల్గొని మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ద్యావాడె సంజీవ్
9908375450
(ఉమ్మడి ఆం.ప్ర.ఆర్టీసీ యూనియన్ మాజీ రాష్ట్ర నాయకులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed