వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఆర్వోఆర్ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ , సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతం కుమార్ లు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం, పట్టాదారులు, రెవెన్యూ ఉద్యోగుల ఇబ్బందులు తొలిగిపోతాయని, చట్టం, నిబంధనలు త్వరగా అమలు జరగాలని వారు ఆకాంక్షించారు.
ప్రధానంగా పట్టాదారుల సమస్యలు మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉందని, అప్పీల్ వ్యవస్థ కారణంగా కోర్టులపై కూడా భారం తగ్గుతుందని వారు తెలిపారు. బిల్లు రూపొందించే క్రమంలో వివిధ వర్గాలతో చర్చించి ట్రెసా ప్రతిపాదించిన అనేక సూచనలు పరిగణలోకి తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు చట్టం యొక్క ప్రయోజనాలను ప్రజలకు అందజేస్తామని, ప్రభుత్వం ఇదే స్పూర్తితో గ్రామ రెవెన్యూ వ్యవస్థ ను పటిష్టం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
బిల్లులో పొందుపరిచిన అధికారులపై క్రిమినల్ చర్యలకు ఉన్న అవకాశాన్ని తొలగించాలని, దీనివలన అధికారులు భయంతో పేదలకు న్యాయం చేయలేరని రెవెన్యూ మంత్రి ని కోరారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, నిరంజన్, రమన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తారక్ తదితరులు పాల్గొన్నారు.