(దండుగుల శ్రీనివాస్)
ఖజానా ఖాళీ అంటూనే.. గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తూనే… వేల కోట్లు మిత్తీల కట్టేందుకే సరిపోతున్నామని సాకులు చెబుతూనే కోట్లకు కోట్ల రూపాయలు పత్రికల యాడ్స్‌కు కేటాయిస్తోంది రేవంత్ సర్కార్. కోట్లు గుమ్మిరించి ఆ పత్రికల్లో ఆయా మీడియాల్లో సానుకూల వార్తలు రాయించుకుని ఇక తమ పని అయిపోయిందనుకుంటున్నదది. కానీ అసలు కథ మొదలవుతుంది ఇక్కడే. సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్‌ను. హనుమంతుడిని చేయబోతే కోతైనట్టు… రైతుల సపోర్టు కోరి వారి ప్రభుత్వమని చెప్పుకునే ప్రయత్నం ఎంత చేసినా ఫలితం రాకపోగా తిట్లదండకం చదవడం మొదలు పెడుతున్నారు. దీనికి బీఆరెస్ పార్టీ శ్రేణులు, బీఆరెస్ సోషల్ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది.
మొన్నటి రైతు రుణమాఫీ విషయంలో ఎంత ఆర్భాటంగా మొదలు పెట్టినా.. అందరికీ సకాలంలో రాక, సరిపడా నిధులు లేక.. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా రైతుల వద్ద విశ్వాసం కోల్పోయే పరిస్థితికి తెచ్చారు అందరు కలిసి. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం దీన్ని ధీటుగా ఎదుర్కోలేకపోయింది. చతికిలబడింది. మెయిన్ మీడియాను కోట్లతో కమ్మేశామనే ఆనందమే తప్ప కాంగ్రెస్ సర్కార్‌కు ఒరిగిందేమీ లేదు వాటితో. వాటికన్న వందరెట్ల బలంతో ఉన్నాయి సోషల్ మీడియా హ్యాండిల్స్. వాటిని బ్యాలెన్స్ చేయలేక కంట్రోల్ తప్పి కన్నులొట్టబోతోంది కాంగ్రెస్ సోషల్ మీడియాకు. రుణమాఫీ సంపూర్ణం చేశారు ముక్కుతూ మూలుగుతు. కానీ రావాల్సిన క్రెడిట్ రాలేదు. తిట్లే మిగిలాయి. లాభం కనిపించలేదు.
ఇక రైతు భరోసా విషయంలో జరుగుతూ వచ్చిన జాప్యం సర్కార్‌పై రైతు కోపానికి కారణమయ్యాయి. ఎట్టకేలకు 26 జనవరి నుంచి ప్రారంభించి టకీ టకీ మని ఇక మెసేజ్లు వస్తాయని చెప్పాడు రేవంత్. కానీ అవి ఎవరికి. కేవలం మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసిన లబ్దిదారులకు మాత్రమే. మరి మిగితా వారికి. మార్చి 31 వరకు చేస్తారట. విడతల వారీగా. గతంలో కేసీఆర్ సర్కార్ కూడా అదే చేసింది.కానీ దీన్నిసరిగ్గా వివరించడంలో విఫలమైంది సర్కార్. కాంగ్రెస్ సోషల్ మీడియా. దీన్నే మంచి అవకాశంగా తీసుకున్నది బీఆరెస్. దాని సోషల్ మీడియా టీమ్. ఆడుకుంటున్నారు.
ఎక్కడ మెసేజ్ …? ఎక్కడ టకీ టకీ రాలేదే.. ?? అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అయినా కాంగ్రెస్ దీనికి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. రైతు స్కీములు కాంగ్రెస్‌ను డ్యామేజీ చేస్తున్నాయే తప్ప మైలేజీని మాత్రం ఇవ్వడం లేదు. మెయిన్ మీడియాను కొనేసి రేవంత్ చంకలు గుద్దుకుంటే.. సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను తన హ్యాండిల్‌లో పెట్టుకుని కేటీఆర్ ఇలా ఆడుకుంటున్నాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.