(dandugula Srinivas)
8096677451
కేటీఆర్ పిచ్చోడని రేవంత్‌రెడ్డి.. రేవంత్‌కు తెచ్చిన పెట్టుబడులన్నీ ఉత్తవే.. ఆయన వల్లే వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయని బీఆరెస్ నేతలు.. ఇలా పెట్టుబడుల వార్ పతాక స్థాయికి చేరుకున్నది స్టేట్ పాలిటిక్స్‌లో. ఓవైపు 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నామని ఆర్బాటంగా ప్రకటించుకున్న సర్కార్‌కు ఆనందం కూడా దక్కనీయకుండా వెంటబడ్డారు బీఆరెస్ నేతలు. ఆరెస్ ప్రవీణ్‌కుమార్ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం వివాదస్పదమైంది. ఫార్మూలా ఈకార్ రేస్ విషయంలో మళ్లీ ఇక్కడ నిర్వహించే విషయంలో సర్కార్ విఫలమైందని, దీని వల్ల రాష్ట్రానికి ఉపాధి వనరులు దెబ్బతిన్నాయని చెబుతూనే.. సీఎం వైఖరి వల్ల పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయాయని ఆరోపించారు.
వెంటనే ఈ విషయంలో రేవంత్‌పై కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఇది జరిగిన కొద్ది సేపటికే సీఎం రేవంత్ సహా మంత్రివర్గ టీమ్ అంతా కలిసి సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది. దావోస్ వేదికగా మళ్లీ ఎన్ని పెట్టుబడులు తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇది తమ సర్కార్ సాధించిన తొలి విజయంగా అభివర్ణించారు. కడుపు మంటతో, కుళ్లుతో అలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, అతనో పిచ్చోడని కొట్టిపారేశారు సీఎం. అంతే కాదు కేటీఆర్‌కు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుందన్న సీఎం.. ఎవరన్నా ఆస్పత్రిలో చూపించాలని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రెస్‌మీట్‌లో సీఎం అమెజాన్ వెబ్ సర్వీస్‌కు బదులు అమెజాన్ వెబ్ సిరీస్ అని పొరపాటున పలికిన వ్యాఖ్యలతో చెలరేగిపోయారు బీఆరెస్ శ్రేణులు, సోషల్ మీడియా.
అంతకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శ్రీశైలంపుణ్యక్షేత్రం తెలంగాణలో ఉందనే విధంగా మాట్లాడారంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెట్టారు. అంతే కాదు దావోస్ పెట్టుబడుల విషయంలో సీఎం మాట్లాడుతూ.. పెండ్లి చూపులు అయిపోయాయి.. ఇక లగ్గపత్రిక రాసుకునేది ఉందని హాస్యంగా మాట్లాడిన మాటలను కూడా తీవ్రంగా విమర్శించారు బీఆరెస్ శ్రేణులు. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న సీఎం అంటూ కామెంట్లు పెట్టారు.