(దండుగుల శ్రీనివాస్)
ఇవాళ కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ ముచ్చట చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం ఫెయిలయిదంటూ ఓ మాట కూడా అన్నారు. ఊరికో కోడి.. ఇంటికో ఈక కూడా కేసీఆర్ ఇవ్వలేదని. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఫ్రీ కట్టిస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ హౌజింగ్ స్కీం మాత్రం అట్టర్ ఫ్లాపే అయ్యింది. ప్రభుత్వ స్థలం దొరకలేదు. దొరికినా సర్కార్ ఇచ్చే అరకొర అమౌంట్‌తో వాటిని కట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. ముందుకు వచ్చి కట్టినా.. ఆ బిల్లులు సకాలంలో రాలేదు. దీంతో నాణ్యత గాలికొదిలేశారు. అవి పేరుకే డబుల్ బెడ్ రూం ఇండ్లు.
కానీ పిచ్చుక గూళ్లను తలపించేలాగే ఉన్నాయి. ఇవీ మొత్తంగా ఎక్కడా కట్టలేదు. కొన్ని చోట్ల.. అలా. రెండో సారీ గెలిపించారు. ఆశ పెట్టుకున్నారు. కానీ ఆశలు నెరవేరలేదు. జనాలు ఘోరంగా మోస పోయారు. ఆ తరువాత కళ్లు తెరిచారు. ఇక పదే పదే మోసం చేయడం కుదరదనుకున్నారు. జాగా మీదైతే చాలు ఐదు లక్షలిస్తామన్నారు. కొద్ది రోజులకే మళ్లీ మాట మార్చారు. మేం ఐదు లక్షలనలేదు. మూడు లక్షలే ఇస్తామన్నారు. అవీ ఇయ్యలేదు.
ఆలోపు మళ్లీ ఎన్నికలొచ్చినయ్. ఇగ మ్యానిఫెస్టోలో మళ్లీ గెలిపించండి.. ఐదు లక్షలిస్తామన్నారు. కానీ ఈసారి జనం నమ్మలేదు. ఓడించారు. అవే ఐదు లక్షలు కాంగ్రెస్ కూడా ఇస్తామన్నది. నమ్మారు. ఓటేశారు. ఇప్పుడు వీరి వంతు. ఇందిరమ్మ ఇళ్లపేరుతో వీటికి అంకురార్పణ జరిగింది. అర్హుల ఎంపిక కూడా చేశారు. ఇది ఉన్నపళంగా ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకంటే విడతల వారీగా ఇస్తారు. కాబట్టి కట్టుకున్న కొద్దీ అమౌంట్ రిలీజ్ చేస్తారు. చివరాఖరకు మళ్లీ ఎన్నికలు దగ్గర పడే సరికి ఎన్ని కంప్లీట్ అయ్యాయి..
ఎంత మందికి నిజంగా ఐదు లక్షలు వచ్చాయి..? మధ్యలో ఎవరెన్ని నొక్కేశారు…? ఆ లెక్కలూ తేలుతాయి. కానీ ఇక్కడ ఈ సర్కార్ కూడా ఈ హౌజింగ్ పథకంలో ఫెయిల్ కాకతప్పదు. ఎందుకంటే జాగా అందరికీ ఉండదు. మరి జాగా ఉన్నా వీరిచ్చే ఐదు లక్షలు ఎటూ సరిపోవు. ఇంకో ఐదు లక్షలు వేసుకున్నా. మరి జాగా లేని వారి పరిస్థితి. డుబల్ బెడ్ రూం కట్టిస్తామంటారు. అది గత సర్కార్ ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది. స్థలం లేని వారికి స్థలం కూడా ఇస్తామంటున్నారు. ఇదసలే సాధ్యంకాదు.
అసలు సర్కార్ జాగాలే లేకుండా చేశారు. ఏతా వాతా.. మొత్తానికి.. వాస్తవానికి.. ఉన్నదున్నట్టుగా.. రియాలిటీగా .. చెప్పాలంటే.. ఈ డబుల్ బెడ్ ఇండ్ల స్కీం.. ఇందిరమ్మ ఇండ్ల పథకం.. పేరు ఏదైనా జనాల చెవిలో పువ్వులు పెట్టడమే చివరకు జరిగేది. ఈ స్కీం ఒట్టి అట్టర్ ఫ్లాప్ షోనే. అదే విషాదం. చివరలో మనకు బోధపడుతుంది. కానీ మళ్లీ ఏవో హామీలిస్తారు..? మళ్లీ ఆశలు చిగురిస్తాయి. మనకదే అలవాటు. వారికదే పరిపాటు. ఇదే రాజకీయ గ్రహపాటు.