(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్‌రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మనసులో మాట బయటపెట్టాడు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేస్తాననే తన వ్యూహం ఫలించిందని, త్వరలో కేసీఆర్ ఉనికే లేకుండా చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. తన వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయడం, ఉనికి లేకుండా చేయడం మొదటిదైతే అందులో సక్సెసయ్యాయనని చెప్పుకొచ్చిన ఆయన.. త్వరలో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమనే విధంగానే స్పందించడం, హరీశ్‌రావు పొలిటికల్ లైఫ్ పూర్తిగా తన చేతుల్లో ఉందనే విధంగా వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇవన్నీ ముచ్చట్లు మీడియా ముందు పంచుకున్నాడాయన. అన్నీ ఓపెన్‌గానే చెప్పుకున్నాడు.
ఇక కార్యాచరణ మిగిలుంది. మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి సినిమా చూపిస్తామామా అనే సాంగేసుకున్నంత ఉత్సాహంగా, ఉన్నదున్నట్టు తన ప్రణాళిక ప్రకటించి కలకలం రేపాడు. దీపావళి ముందు రాజకీయ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ తో రాజకీయంగా చర్చకు రాగా.. ఆయన చెప్పిన బాంబులేమో గానీ, రేవంత్ నోట బాంబుల లాంటి కామెంట్స్ రావడం ఇప్పుడు దివాళీ ముందు హాట్ టాపిక్‌గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముందడుగు పడిన విషయాన్ని తెలిపిన ఆయన… విచారణలు పూర్తయిన తరువాత దోషులకు చట్టపరమైన శిక్షలు తప్పవని పరోక్షంగా కేటీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమనే విధంగా ఆయన స్పందించాడు.
కేటీఆర్ చేతులతో ,చేతల ద్వారా కేసీఆర్‌ను అడుగు పట్టించాననని, హరీశ్ రావుతో కేటీఆర్‌ను రాజకీయంగా సమాధి చేయిస్తానని స్పష్టం చేశాడు రేవంత్. హరీశ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునంటూ నర్మగర్భంగా రాజకీయంగా హరీశ్ ఇక కీలుబొమ్మగా మార్చే ఎత్తుగడతో ఉన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన కల సీఎం కావడమేనని, అది ప్రజలిచ్చారన్న సీఎం రేవంత్.. ఇక వారికి సేవ చేయడమే మిగిలి ఉందని, చెప్పినన్నీ చేసి వారితో శభాష్ అనిపించుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పార్టీ విషయంలో కూడా రేవంత్ తనదైన శైలిలో స్పందించాడు. అందరూ దీపావళికి చిచ్చుబుడ్లతో పండుగ చేసుకుంటే ఆ కుటుంబం సారాబుడ్లతో పండుగ చేసుకున్నదని ఎద్దేవా చేశాడు.
రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడని కూడా రేవంత్ అనడం.. ఆ సంఘటన విషయంలో సర్కార్ ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తోంది. కక్షపూరిత రాజకీయాలుండంటూనే కేసీఆర్ కుటుంబానికి సినిమా చూపిస్తా మామా అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు రేవంత్. మరోవైపు కేటీఆర్ కూడా తన పార్టీ శ్రేణులను అలర్ట్ చేయడం, రేపు ఏదైనా జరగొచ్చు.. సర్కార్ ఎన్ని కేసులైనా పెట్టొచ్చు.. ఇది ఆరంభం మాత్రమేనని, అలర్ట్‌గా ఉండాలంటూ ట్వీట్ చేయడం.. ఇక తనను అరెస్టు చేస్తారని ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చాడు. సిటీలో నెల రోజుల పాటు కర్వ్యూ విధించడం వెనుక కూడా ఇక రాజకీయ కలకలం రేగనుందనే సంకేతాలిచ్చింది సర్కార్.