(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ ఓ టైపు.. కేటీఆర్ మరో టైపు.. .ఆయనోటైపు.. ఈయనో టైపన్నమాట. ఆయనేమో జనాలపై అలిగి ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యాడు. ఈయనేమో గుడ్దెద్దు చేలో పడ్డట్టు.. పిచ్చోడి చేతిలో రాయిలా… అనాలోచిత, అహంకారపూరిత, ఫ్రస్టేటెడ్ నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాడు. ఇప్పుడివన్నీ ఎందుకంటారా..! వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా విలేజ్ కోసం సర్కార్ చేపట్టనున్న భూసేకరణ కోసం అభిప్రాయ సేకరణ నిమిత్తం వెళ్లిన కలెక్టర్‌పై దాడి సంఘటన. ఇది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగింది.
బీఆరెస్ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు సురేశ్ దీంట్లో కీలక పాత్ర. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పట్నం నరేందర్‌రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై ఎలాంటి సానుభూతి బీఆరెస్ పార్టీకి దొరకలేదు. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి .. అన్నట్టుగా కేటీఆర్ చేసిన ఏ డైరెక్షన్ కూడా హిట్టు కాలేదు సరికదా… యావరేజీ మైలేజీ కూడా రాకపోగా.. అట్టర్ ఫ్లాప్ అయి కూర్చింది ఇలా. ఏకంగా కలెక్టర్‌పైనే దాడికి తెగబడ్డ వైనాన్ని ఏ సెక్షను కూడా అంగీకరించలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు. కలెక్టర్లపైనే దాడులకు తెగబడితే ఇంకా ఏమన్నా ఉందా..? దీనిపై కఠినంగా వ్యవహరించాలనే దోరణి అంతటా ఉంది.
కాగా అధికారులపై దాడి విషయంలో కేటీఆర్ మౌనం ఆ పార్టీకి మరింత నష్టం చేకూర్చేలా తయారయ్యింది. ఇదే అంశాన్ని రేవంత్‌రెడ్డి లేవనెత్తాడు. అధికారులపై దాడులు జరిగితే ఖండించరా.. పైగా దాడులు చేసిన వారి వద్దకు వెళ్లి పరామర్శిస్తారా..? వెనుకుండి ఇదంతా చేయడమే కాకుండా… కలెక్టర్‌పై దాడి జరిగినా మంచిగా జరిగింది… వారు కడుపు మంటతో అలా చేశారంటూ పరాచికాలాడుతారా ..? అని నిలదీయడం ఆ పార్టీకి మరింత ఇరకాటంలో పెట్టింది. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేలకు వరుసగా నోటీసులు జారీ అవుతున్న తరుణంలో .. వికారాబాద్ ఇష్యూలో బీఆరెస్ తీసుకున్న నిర్ణయం, వేసిన స్టెప్స్ పూర్తిగా బూమరాంగ్‌గా మారాయి.
అటు అధికారుల నుంచి కూడా బీఆరెస్ పార్టీ పట్ల, కేటీఆర్ వ్యవహార శైలి పట్ల తీవ్ర వ్యతిరేకత రాగా.. అధికారులతో బీఆరెస్ పార్టీకి మరింత అంతరం పెంచుకున్నట్టయ్యింది. ఇక పొలిటికల్ మైలేజీ కోసం అంగలార్చిన కేటీఆర్‌కు.. ఇది మరింత చేదు అనుభవాన్ని , మరకను మిగిల్చింది. దాడులు చేసిన లంబాడాలైతే తండాలు ఖాళీ చేసి పారిపోయారు. అంత సీరియస్‌గా యాక్షన్ మొదలు పెట్టింది సర్కార్. పట్నం నరేందర్‌రెడ్డి పై పలు కేసులు పెట్టి జైలుకు పంపే యోచనలో సర్కార్ ఉంది. ఇలా చేసినా ఏ సెక్షన్ నుంచి కూడా కనీస సానుభూతి కూడా ఆ పార్టీకి లభించే అవకాశాలు లేకపోవడం కేటీఆర్ తీసుకున్న అనాలోచిత , దుందుకుడు నిర్ణయాలకు బలైపోయే సంఘటనలో ఇదో ఉదాహరణ మాత్రమే.