(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
అనాదిగా రాజకీయ వారసత్వం కోసం పరివారంలో పొలిటికల్ పవర్ వార్ దేశ, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. అంతఃపుర కలహాలు మహానేతలను సైతం బజారుకీడ్చాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదలుకొని నేటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పరివార్‌లో నలిగిపోయినవారే. 1980లో ప్రధాని ఇందిరాగాంధీ, 2025లో కేసీఆర్ కుటుంబంలో పొలిటికల్ వార్‌కు చాలా పోలికలున్నాయి. 1995లో ఎన్టీఆర్ కూడా రాజకీయ సంక్షోభాన్ని ఇదే విధంగా ఎదుర్కొన్నప్పటికీ కొంత భిన్నమే అని చెప్పవచ్చు. దేశంలో చాలా రాష్ట్రాలలో ఫ్యామిలీ పొలిటికల్ వార్‌లు బజారుకెక్కినప్పటికీ, ఈ మూడు ఉదంతాలు రాజకీయ చరిత్రలో సంచలనమని చెప్పుకోవచ్చు.
ఇందిరాగాంధీ విషయానికొస్తే.. 1980లో తన తనయుడు సంజయ్‌గాంధీ మరణానంతరం కుటుంబపరంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సంజయ్‌గాంధీ వారసురాలిగా అమేథీ నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలని సంజయ్‌గాంధీ భార్య మేనకా గాంధీ పట్టుబట్టారు. దానికి ఇందిరాగాంధీ అంగీకరించక..తన రెండవ కొడుకు రాజీవ్‌గాంధీని బలవంతంగా అమేథీ నుంచి దింపారు. సంజయ్‌గాంధీ వారసులకు, మద్దతుదారులకు అన్యాయం చేస్తున్నారని, ఇందిరాగాంధీపై మేనక గాంధీ తిరుగుబాటు చేశారు. ఒకే నివాసంలో ఉన్నప్పుడే వారసత్వ కుంపటి రగిలింది. ఇందిరాగాంధీ హెచ్చరికలను కాదని, మేనకాగాంధీ తనకు న్యాయం కోసం బహిరంగ సభలను ఏర్పాటు చేసింది. అప్పటికే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్‌గా ఉన్న ఇందిరా గాంధీ.. మేనకా గాంధీ తిరుగుబాటుతో సంకటంలో పడ్డారు. చివరకు తన కోడలు మేనకాగాంధీ, మనమడు వరుణ్ గాంధీని కట్టుబట్టలతో ప్రధాని నివాసం నుంచి గెంటేశారు. తరువాత జరిగిన వారసత్వ పోరు కుటుంబానికి ఎంతో కొంత మచ్చ తెచ్చింది.
కుటుంబం రెండుగా విడిపోయింది.
ఇందిరాగాంధీ మరణానంతరం ఇప్పటి వరకు ఆ పోరాటం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్ కూడా నాడు ఇందిరాగాంధీ కంటే ఎక్కువ వారసత్వ పోరులో ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్నారు. నాడు అమేధీలో నిప్పు రగులుకుంటే .. ఇక్కడ నిజామాబాద్ ఓటమితో నిప్పు రాజుకుంది. లిక్కర్ కేసులో అరెస్టుతో ఆ కుటుంబ పోరు పతాక స్థాయికి చేరింది. చివరకు చట్ట సభ సాక్షిగా తండ్రి కేసీఆర్‌పైనే ఏం పీకారన్న స్థాయిలో విమర్శనాస్త్రాలను శరపరంపరగా సాగించారు. శాపనార్ధాలు పెట్టారు. 1995లో కూడా దాదాపుగా కుటుంబ వారసత్వ పోరులో మహామేథ, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికార పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. లక్ష్మీ పార్వతి విపరీత జోక్యం వల్ల ఎన్టీఆర్‌తో కుటుంబం దూరమైంది. పార్టీ భారమైంది. చివరకు తిరుగుబాటు కావొచ్చు, వెన్నుపోటు కావొచ్చు.. సొంత అల్లుడు , ఏపీ ముఖ్యమంత్రి చేతిలో పరాభవానికి గురి కావాల్సి వచ్చింది. ఇక్కడ తేడా ఏమిటంటే.. కోడలు, కూతురు కాదిక్కడ.. అల్లుడు ప్రధాన తిరుగుబాటు దారుగా నిలిచారు. కానీ దివంగత నేత ఎన్టీఆర్‌ను ఆ కుటుంబం కానీ, అల్లుడు కానీ, పార్టీ నాయకులు కానీ విమర్శించిన దాఖలాలు లేవు. వారి గురంతా లక్ష్మీ పార్వతిపైనే ఉండేది.
ఇక కవిత విషయానికొస్తే.. ఆమె అన్ని హద్దులు దాటిపోయారు. ముందు పార్టీపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తరువాత మరో అడుగు ముందుకేసి బావ,అన్నలపై బాణం ఎక్కు పెట్టారు. మొదట తండ్రి చుట్టూ దయ్యలన్నారు. చివరకు తండ్రే దయ్యమన్నారు. తండ్రి ఫోటో లేకుండా రాజకీయ యుద్దానికి సిద్దమయ్యారు. తెలంగాణకు పదేండ్లలో తీరని అన్యాయం జరిగిందని, తండ్రిని దోషిగా నిలబెట్టి తన సొంత పార్టీని స్థాపించుకోవడానికి పావులు కదుపుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. చట్ట సభలో ఆమె చేసిన విమర్శలు అధికార పార్టీ కాంగ్రెస్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబంపై ఆమె చేసిన దాడికి నివ్వెరపోయారు. వ్యూహాత్మకంగానే ఆమెకు అధికార పార్టీ పూర్తి అవకాశం ఇచ్చినప్పటికీ అంతలా దాడి చేస్తుందని వాళ్లు కూడా ఊహించకపోవచ్చు. తమ పాత్రను కూడా కవితనే నిర్వర్తిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.
కవిత ఎపిసోడ్‌లో ఏమీ చేయాలో పాలు పోక బీఆరెస్ సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తన్నపోతే .. కొట్టబోతే అన్నట్టుగా మారింది వారికి. కవితపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్ని రోజులు విమర్శలు చేసినప్పటికీ తండ్రి కేసీఆర్ దాన్ని వ్యతిరేకించారు. ఆమె జోలికి పోవద్దని, విమర్శలకు ప్రతి విమర్శ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకోవద్దని అన్న కేటీఆర్ కూడా ఆదేశించినట్టు సమాచారం. దీనితో పరుషపదజాలంతో ఆమె చట్టసభలో విమర్శించినా పార్టీ తరుపున స్పందన లేదు. అధికార పార్టీ డైరెక్షన్..ఈమె ఓవరాక్షన్ అని కూడా అనలేదు వారు. కవిత కొత్తగా పార్టీ పెడితే బీఆరెస్ ను దెబ్బతీస్తుందా? కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందా? లేక బూమరాంగ్ అవుతుందా ? వేచి చూడాలి.
