dandugula Srinivas
ఇప్పటి దాకా చదవిన చదువులు ప్రాక్టికల్‌కు దూరంగా, స్కిల్స్ లేకుండా ఉండటంతో పోటీ ప్రపంచంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ఏటా నిరుద్యోగం పెరుగుతున్నది. విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగడం లేదు. ప్రాక్టికల్ చదువులు కాకుండా బట్టీ చదవులు ర్యాంకుల గోలలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. పాలకులెవరైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యం కాదు. మరి ఇంతలా పెరుగుతున్న నిరుద్యోగ వ్యవస్థకు పరిష్కారమార్గం ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు సంపాదించడం. అదెలా..? దీనికి పరిష్కారం స్కిల్స్ పెంచే విద్యనందించి సరైన ట్రెయినింగ్ ఇస్తే ప్లేస్‌మెంట్ కంపల్సరీ అని గుర్తించింది సర్కార్.
అందుకే ఆ దిశగా తొలి అడుగు వేసింది. సీఎం దీనికి అంకురార్పణ చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీనే ఏర్పాటు చేసింది సర్కార్. దీనికి సంబంధించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. తొలివిడతగా పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి వీరికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నది సర్కార్. దీని కోసం 20 ఇంజినీరింగ్, 18 డిగ్రీ కాలేజీలను ఎంపిక చేసుకున్నది కూడా. డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులతో పాటే ఖరీదైన ఈ విద్యను ఉచితంగా అందించేందుకు వారికి ఉపాధి అవకాశాలను అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నది ప్రభుత్వం.