‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల
………………………

 

కేసీఆర్‌ పథకాల ప్రకటనలో ఓ రేంజ్‌కి తీసుకుపోయాడు రాజకీయాలను. ఇప్పుడు వాటిని అందుకునేందుకు ప్రతిపక్షాలు తండ్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది .. ఆల్టర్‌నేట్ మేమే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు కూడా ఎక్కడో అనుమానం. ఒక్క వ్యతిరేకత సరిపోదు. గెలవాలంటే. మరింకేమి కావాలి..? ‘అంతకు మించి’ పథకాలు అమలు చేయాలి. ఎలా..? కర్ణాటక అనుభవం ముంగిట ఉండనే ఉంది. అవే ఇక్కడ వల్లెవేస్తే…ఉహూ.. అవీ సరిపోవు. మరి..? ఇక్కడ చేస్తున్నవాటిపై కూడా ఫోకస్‌ పెట్టాలి. ఇక్కడి పథకాలపై కూడా ‘అంతకు మించి’ ప్రయోగించాలి. ఇగో అందులో భాగంగానే పుట్టుకొచ్చిందీ గ్యారెంటీ పథకాలు.. గ్యారెంటీ కార్డులు. ఇవాళ ఉదయం లేవగానే దాదాపు మెయిన్‌ స్ట్రీమ్‌ అన్ని ప్రింట్‌ మీడియాల్లో రేవంత్‌, బట్టి విక్రమార్కల సంతకాలతో కూడిన ‘గ్యారెంటీ కార్డు’ను కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్‌ ఇచ్చారు.

మరీ నవ్వులాటలా మారింది. అపనమ్మకానికి పరాకాష్టలా నిలిచింది. వారిపై వారికి నమ్మకం లేదు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని బలంగా, విశ్వాసంగా ప్రజలతో గొంతు కలుపుతున్న వేళ… ఆమెనే తీసుకొచ్చి వేదికపై పథకాల హామీలు ఇప్పించిన వేళ గ్యారెంటీ అనే మాట ఎందుకు..? కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మడం లేదా.? సోనియమ్మను నమ్మడం లేదా..? ఇప్పుడు తెలంగాణ ఎవరు తెచ్చింది అంత ఇంపార్టెంట్‌ ఇష్యూ కాదని తేలిపోయిందా..? జనాల్లో పథకాల హామీల పట్ల తెలంగాణ ప్రజలు విస్తుపోయి ఉన్నారా..? విసిగిపోయి ఉన్నారా..? ఏమో మమ్మల్ని నమ్మడం లేదు కదా.. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ‘గ్యారెంటీ కార్డు’ ప్రయోగించారా..?. కారణం ఏదైనా ఇది ఆ పార్టీ ఆత్మన్యూనతకు సంకేతంగా చెప్పవచ్చు. కర్ణాటకలో అమలు చేయకపోతే ఆ తర్వాత ఫలితం అనుభవిస్తారు. తెలంగాణలో నమ్మి ఓటేస్తే ఎలాగోలా ఇచ్చి తీరుతారు. ఇందులో ఇంత అనుమానం ఎందుకు..? మీపై మీకే నమ్మకం లేదా..? అనే భావన జనాల్లో వచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా సోనియా స్థాయి లీడర్లు హామీలు ఇచ్చిన తర్వాత ఇందులో ప్రజలకు అపనమ్మకం ముచ్చటే ఉండదు.

అవును.. కాంగ్రెస్‌ తను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలులో లేకుండొచ్చు. కానీ కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే, అధికారం కావాలంటే ‘అంతకు మించి’ అనే ఆలోచన చేయడంలో తప్పు లేదు. మాటిచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం, బాధ్యత ఆ పార్టీలపై ఉంటుంది. లేదంటే చరిత్రహీనులుగా మిగిలపోతారు. అపనమ్మకం ముంచేస్తుంది. కాంగ్రెస్‌కు ఇంకా ఆ పరిస్థితి రాలేదు ఇక్కడ. ఎందుకంటే అదింకా అధికారంలోకే రాలేదు. బీజేజీ ఇలాంటి హామీలు ఇవ్వజాలదు. దానికంత సీన్‌ లేదు.దాని ఎజెండా మతం, అంతే. అందుకే అలా ఎగిసిపడిన కెరటంలా గాలి వచ్చి వెళ్లింది. ఇప్పుడు హవా కాంగ్రెస్‌ది నడుస్తోంది. కానీ ప్రజల్లో ఈ పార్టీ నాయకులపై ఓ అపనమ్మకం ఉంది … గెలిచినా మళ్లీ పార్టీ మారుతారని. ఇదీ అసలైన సమస్య దానికి. కానీ కేసీఆర్‌కు ఆల్టర్‌నేట్‌ కాంగ్రెస్సే అని బలంగా ప్రజలు భావిస్తే, దానికి తోడు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు బాగా ఆకర్షిస్తే కాంగ్రెస్‌ ఒంటరిగా గెలిచే సత్తా సంపాదించే అవకాశం లేకపోలేదు.

కానీ ఎక్కడో ఆ నాయకులకే అపనమ్మకం. అందుకే సోనియా స్వయంగా హామీలిచ్చినా ప్రజలకు విశ్వాసం లేదనే విధంగా ఈ రోజు యాడ్స్‌ రూపంలో రేవంత్‌, బట్టిల సంతకాలతో జాబ్‌ గ్యారెంటీ తరహా గ్యారెంటీ కార్డు అని ప్రకటనలు జారీ చేయడం ఆ పార్టీ దివాళకోరుతనం, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తోంది. ప్రజల్లో తమకు వచ్చిన గాలిని సరిగా అంచనా వేయడంలో ఆ పార్టీ విఫలమైంది. గతంలో పార్లమెంటు ఎన్నికల్లో బాండు పేపర్‌ రాసిచ్చి అర్వింద్‌ ఎంపీగా గెలిచాడు. ఐదు రోజుల్లో పసుపుబోర్డన్నాడు. కానీ రాలేదు. నమ్మకం పోయింది. బీజేపీ స్థానిక లీడర్లు, స్థానిక అభ్యర్థులు ఇచ్చే ఇలాంటి హామీలను కనీసం ఇప్పుడు పరిగణలోకి కూడా తీసుకోరు జనాలు. బాగా అర్థమయ్యేలా గుణపాఠం నేర్పాడు అర్వింద్‌ ప్రజలకు. కేంద్రంతో కొట్లాడి ఇక్కడి ప్రజల అభీష్టాన్ని నెరవేర్చేంత సీన్‌ ఆపార్టీ లీడర్లకు లేదు. కానీ స్వయంగా సోనియాగాంధే వచ్చి చెప్పిన హామీలకు ఈ గ్యారెంటీ ఎందుకు నాయకా..? మరీ మిమ్మల్ని మీరు తగ్గించేసుకుని, కుంచించుకుపోవడమే తప్ప. ప్రజల ముందు చులకన అవడమే తప్ప.

మరి బీఆరెస్‌ను ప్రజలు నమ్ముతున్నారా.? పూర్తిగా నమ్మడం లేదు. బీఆరెస్‌ ఇచ్చిన హామీల్లో కూడా అమలు కానివి, మధ్యలో నిలిచినవి ఉన్నాయి. కానీ మెజారిటీగా ప్రతిఫలాలు అందుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకులకు మరో భయం ఏంటంటే.. (అసలు ఇదే అసలు భయం) కేసీఆర్‌ రేపు తన అమ్ముల పొదిలో నుంచి ఎలాంటి హామీలు తీస్తాడోనని. అలవిమాలిన హామీలని అన్న కేసీఆర్‌ కూడా తను ‘అంతకు మించి’ ఊహించని హామీల అస్త్రాలను తన అమ్ముల పొదిలో నుంచి తీస్తాడు. డౌట్‌లేదు. అప్పుడు ప్రజలు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపుతారు. కానీ అసలు సమస్య ఇప్పుడు తెలంగాణ ఇది కాదు. వ్యతిరేకతకు తోడు, కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం, సిట్టింగులకే మూడోసారి వరసగా టికట్‌ ప్రకటించంతో ఇది పథకాలు అనే ఇష్యూ నుంచి డైవర్ట్ అయ్యింది. కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలనే గాలికొంత ఆ పార్టీ అభ్యర్థులకు మేలు చేయవచ్చు. దీనికి తోడు లోకల్ లీడర్‌పై తీవ్ర వ్యతిరేకత ఓడించాలనే బలమైన సంకల్పం ఓటర్లో దాగుండొచ్చు. అలాంటప్పుడు ఆల్టర్‌ నేట్ కోసం చూసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్సే కనిపిస్తుంది. బీజేపీకి స్థానం ఉండదు. ఈ జమిలీ గొడవ అందుకే బీజేపీ లేవనెత్తి ఎంతోకొంత లబ్దిపొందాలనే తపనలో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అది ఊహించినంత బలం ఓటర్ల నుంచి బీజేపీకి రాదు.

You missed