ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని చాలా ప్రచారం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే కోపం చాలానే ఉంది. వీటన్నింటికీ ఇవాళ సమాధానమిచ్చాడు సీఎం కేసీఆర్. ప్రైవేటు పరం కాదు.. ఇక పై అది సర్కారుదేనని తేల్చి చెప్పాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక సర్కార్ ఎంప్లాయిస్ అయిపోతారు. దీంతో ఇప్పటిదాకా నిగూఢంగా వారిలో దాగి ఉన్న అసంతృప్తి, ఆగ్రహం అంతా శాంతం అయిపోయింది.
ఎన్నికల వేళ సరైన సమయానికి కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని అంతా భావిస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు పెద్ద షాకే. కాగా ఇందూరులో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌కు క్షీరాభిషేకం చేశారు. బాజిరెడ్డి జగన్ తదితర బీఆరెస్ నాయకులు సైతం సంబురాల్లో పాల్గొన్నారు. సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.