భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయట. ఎందుకో తెలుసా..? జనం బాధలు చూసి కాదు..? వారి కష్టాలు చూసి అసలే కాదు..? చెరువులు, రోడ్లు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారని కూడా కాదు…. మరెందుకంటారా..? తను కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత భారీ ర్యాలీతో నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడట.

కానీ ఈ భారీ వర్షాలతో భయపడి హైదరాబాద్‌లో ఇంట్లోని ఉండి ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులు గమనిస్తూ… వర్షాల వర్తాలు తెలుకుంటూ.. వరుణుడా కాస్త జోరు తగ్గించూ అని దీనంగా అభ్యర్థిస్తూ గడుపుతున్నాడట. ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి కానీ, పెర్కిట్‌ చౌరస్తా నుంచి కానీ పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలనేది సునీల్‌ రెడ్డి ప్లానట. ఇక్కడ ఇల్లుకాలి ఒకడేడిస్తే… అక్కడ హైదరాబాద్‌లో భారీ ర్యాలీతో హంగామా చేసుకుంటూ తన రాకను నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేందుకు నానా తంటాలు పడుతున్నాడట సునీల్‌.

కాంగ్రెస్‌ బాల్కొండ టికెట్‌ కోసం చెప్పులరిగేలా తిరిగి తిరిగి.. మొత్తానికి ఎలాగోలా వారిని ఒప్పించి పార్టీ కండువా కప్పుకున్న సునీల్‌… ఆ వెంటనే వచ్చిన భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డా తన ర్యాలీ ప్రోగ్రాం మాత్రం వాయిదా వేసుకోలేదు. మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాత్రం నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. సునీల్‌ కు టికెట్‌ ఇస్తామని ఎవరు చెప్పారు..? పార్టీలో చేరాడంతే అని తన స్టైల్లో తను చెప్పుకుంటూ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరామర్శలు చేస్తున్నాడు. పాపం… సునీల్‌ రెడ్డి..! ఏం చేద్దామన్నా.. ఏదో ఒకటి ఇలా అడ్డం వచ్చి పడుతున్నది. ఆదిలో హంసపాదులా కాంగ్రెస్‌తో భారీ ఎంట్రీ ఇద్దామంటే భారీ వర్షాలు తన గ్రాండ్‌ వెల్కమ్‌కు గండికొట్టాయే అని తెగ ఇబ్బంది పడుపోతున్నాడట..

You missed