అనుకున్నట్టే జరిగింది. వాస్తవం చెప్పిందే నిజమైంది. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టించాడు. ఎంపీ అర్వింద్‌పై నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్వింద్‌ నుంచి పార్టీని కాపాడాలని .. సేవ్‌ బీజేపీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఊహించని ఈ హఠాత్పరిణామాలపై జిల్లాలో తీవ్ర చర్చ మొదలైంది.

ఆ పార్టీలో అలజడి మొదలైంది. పదిహేను, ఇరవై ఏండ్ల నుంచి పార్టీలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను మండలాధ్యక్షుల పదవుల నుంచి తొలగించి ఎంపీ అర్వింద్‌ తన అనుచరులతో నింపుకోవడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. కానీ అధిష్టానం దీన్ని పట్టించుకోలేదు. ఎంపీ అర్వింద్‌పైనే భారం వేసి చేష్టలుడిగి చూడటాన్ని వీరు సహించలేకపోయారు. ఇది వారి కోపానికి మరింత ఆజ్యం పోసింది.

దీంతో ఇవాళ ఐదు నియోజకర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడే బైఠాయించారు. పార్టీ ఆఫీసును ముట్టడించారు. అర్వింద్‌ డౌన్.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇది హాట్‌ టాపిక్ గా మారింది.

You missed