రాజకీయాలన్నీ ఆర్మూర్‌ చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు.. అధికార పక్షంలో కూడా నాకంటే నాకు అని టికెట్‌ కోసం పోటీలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తప్ప అక్కడ పోటీకి ఎవరూ లేరనేది తెలుసు. సిట్టింగులు ఎక్కడా కూడా ఆ స్థాయిలో సెకండ్‌ క్యాడర్‌ను ఎదగనీయలేదు కూడా. అయితే ఆర్మూర్‌ బరి నుంచి తనకు అవకాశం ఇస్తే పోటీకి సిద్దమనే సంకేతాలిస్తున్నాడు మార గంగారెడ్డి. పార్టీ పుట్టిన నాటి నుంచి కేసీఆర్‌తో సాన్నిహిత్యంగా, పార్టీ విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. రాజకీయాలకు కొంత దూరం పాటిస్తూ వస్తున్నాడు. తొలిసారే ఇక్కడి నుంచి ఆయన టికెట్‌ ఆశించినా దక్కలేదు.

ఆ తర్వాత సిట్టింగులకే అని కేసీఆర్‌ ప్రకటించడంతో ఆశలు చాలించుకుని ప్రయత్నాలు విరమించుకున్నాడు. ఇక ముచ్చటగా మూడోసారి సిట్టింగులను మార్చితే తానున్నానంటూ ఓ సిగ్నల్‌ ఇస్తున్నాడు. పార్టీ ఆవిర్బావం తర్వాత అంకాపూర్‌లో తొలిసారి కేసీఆర్‌తో మీటింగు పెట్టించాడు మార గంగారెడ్డి. అప్పట్నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని, కేసీఆర్ ను వదల్లేదు. పదవులు ఇవ్వకపోయిన విధేయుడిగా పార్టీ అధిష్టానం సూచనలు, ఆదేశాలు పాటిస్తూ వస్తున్నాడు.

ఆయన విధేయతకు గుర్తుగా మార్క్‌ఫెడ్ చైర్మన్‌ను చేశాడు కేసీఆర్. కానీ దీంతో ఆయన సంతృప్తి పడలేదు. చూపంతా ఆర్మూర్‌పైనే. ఎమ్మెల్యే కావాలనే. దీంతో ఈసారి ఎదైనా చిన్న అవకాశం ఉన్నా జారవిడుచుకోదలుచుకోవడం లేదు మార. తెర వెనుక పెద్దలతో టచ్లో ఉంటున్నాడు. అందరివాడిగా అందరితో మంచి సంబంధాలు నెరిపే మార గంగారెడ్డి .. ఆర్మూర్‌లో తనకు ఈసారి అవకాశం ఇవ్వాలనే సందేశాన్ని తన సన్నిహితుల ద్వారా కేసీఆర్‌ చెవిన వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

You missed