విలేకరులు కరువయ్యారు. కొరత ఏర్పడింది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలో ఎంపిక కావాలంటే సవాలక్ష ఆంక్షలు, పరీక్షలు, శల్య పరీక్షలు… ఇప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ పత్రిక విలేకరుల కోసం వెతుక్కుంటుంది. విలేకరుల కావాలెను అని ప్రతీ నెలకోసారి ఇలా ప్రకటనలు ఇచ్చినా… ఆ సమయానికి అక్కడ పరీక్ష రాసేందుకు వచ్చేది అరకొరే. అసలు కొన్ని సెంటర్లకు ఎవరూ రాని పరిస్థితి కూడా ఉంది. ఇదిగో ఇలా ఈవాళ నమస్తే తెలంగాణ విలేకరుల కోసం ప్రకటన ఇచ్చింది. ఇందులో విద్యార్హత పెట్టలేదు. కనీసం డిగ్రీ ఉండాలి అని గతంలో పెట్టేవారు.
దాదాపు అన్ని మెయిన్ పత్రికలూ ఇలాగే వేసేవి. కానీ విద్యార్హత డిగ్రీ పెడితే ఎవరూ రావడం లేదు. డిగ్రీ చదవి ఆ అరకొర ఇచ్చే లైన్ అకౌంట్‌కు పనిచేయాలా..? సర్క్యూలేషన్, యాడ్స్ పేరుతో టార్గెట్లు.. ఇనవ్నీ బాధలు కన్నా ఏదైనా నెలకు పదివేల జీతం వచ్చే ఉద్యోగం చేసింది బెటర్ బాసూ..! అని జారుకుంటున్నారు. అందుకే ఈసారి నమస్తే ప్రకటనలో విద్యార్హత కనిపంచలేదు. ఎవరిచ్చొనా సరే కళ్లకద్దుకుని తీసుకోవడమే తరువాయిగా ఉంది. యాడ్స్ , సర్క్యూలేషన్ టార్గెట్స్ చేయకపోతే ఆ రిపోర్టర్ డేట్‌లైన్ ఆపేయడం.. మానసికంగా ఇబ్బంది పెట్టడం… ఆపై అదే మండలానికి రూరల్ కింద ఇంకొకర్ని తీసుకొచ్చి పెట్డడం పత్రికల్లో వస్తున్న ఆనవాయితీ. రూరల్ డేట్ లైన్‌లు కనిపించాయంటే దాదాపుగా ఇదే తంతు. సొంతగా ఓ వెబ్‌సైటో, ఓ యూట్యూబ్ చానలో పెట్టుకుని ఎవరికి వారే గల్లా ఎగరేసుకుని తిరగే సోషల్ మీడియా రోజులు ఇవి. ఈ కాలంలో పాపం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా విలేకరుల కోసం అపసోపాలు పడుతోంది.
కరోనా దెబ్బతో ప్రింట్ మీడియా పాతాళంలోకి పడిపోయింది. పేజీలు తగ్గించారు. ఉద్యోగులను పీకేశారు. ఖర్చు తగ్గించుకున్నారు. అదే సమయంలో పేపర్‌లను చదవడమూ తగ్గించేశారు పాఠకులు. దీంతో ప్రింట్ మీడియా పరిస్థితి దారుణంగా మారింది. ఈ సమయంలో కొత్త రిపోర్టర్లు రావాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఓ రకంగా బతిమాలుకుని మరీ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.