చాలా రోజులైంది కేసీఆర్ నిజామాబాద్‌కు వచ్చి. కవిత ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆయన నిజామాబాద్‌కు రాలేదు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి కూడా చాలా ఏండ్లైంది. ఎప్పుడో రావాల్సింది. కానీ రాలేదు. ఇగో ఇలా ముహూర్తం కుదిరింది. కానీ అప్పటికే ఇక్కడ బీజేపీ పుంజుకుంది. అది టీఆరెస్ లోకల్ లీడర్ల స్వయంకృతాపరాధం. ఇది కాదనలేని వాస్తవం. కవిత జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండటం కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనైతే .. బీజేపీ మేయర్ సీటు దక్కించుకునే రేంజ్లో విజయం సాధించింది.
ఇది టీఆరెస్‌కు తలవంపులాంటిదే. అయినా ఇక్కడ లోకల్ లీడర్లలో మార్పు రాలేదు. మేల్కోలేదు. దీనికి తోడు కవితా యాక్టివ్ కాలేదు. దీంతో బీజేపీకి ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నగరంతో పాటు అది మిగిలిన నియోజకవర్గాలకూ పాకుతున్నది. ఈక్రమంలో ఎట్టకేలకు కేసీఆర్ నిజామాబాద్ టూర్ ఫైనల్ అయ్యింది. ఈ రోజు ఆయన రానున్నారు. కొన్ని గంటల్లో కొత్త కలెక్టరేట్, టీఆరెస్ భవన్ ప్రారంభించిన తర్వాత భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నది. ఆయన ఎక్కడికి వెళ్లినా బీజేపీపై విరుచుకుపడుతున్నాడు.
అన్ని సభలు వేరు.. నిజామబాద్ సభ వేరు. అందుకే దీన్ని టీఆరెస్ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మిగిలిన నాయకుల స్పీచ్‌లకు అంత ప్రాధన్యత ఉండకపోవచ్చు… కానీ కేసీఆర్ మాట్లాడే ప్రతీ మాటకు ఇక్కడ ఓ వెయిట్ ఉంది. ఆయన స్పీచ్ ఎలా ఉంటుంది. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు..? ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా లోకల్ బీజేపీ, మోడీ , షా ద్వయానికి షాక్ నిచ్చేలా ఆయన చేసే ప్రసంగం టీఆరెస్‌కు కొత్త జవజీవాలనివ్వనున్నాయి. ఇందూరు రాజకీయాల్లో ఈ రోజు సీఎం టూర్ కీలకంగా మారనుంది. రాజకీయ సమీకరణల మార్పులో కూడా ఈ సభ కీలకభూమిక పోషించనుంది.