నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు వాయిదా ప‌డుతూ రావ‌డంతో ఈ అంశం చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. జిల్లా రాజ‌కీయాల్లో ప‌లు మార్పులు చోటు చేసుకోవ‌డం, బీజేపీ కొంచెం బ‌లం పుంజుకుని ఇక్క‌డ ఎంపీగా క‌విత ఓడిపోయి.. అర్వింద్ గెల‌వ‌డం… ఈ రెండు పార్టీలు ఉప్పునిప్పులా ఉండి.. రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌డం… ప‌రిణామాల నేప‌థ్యంలో క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం వాయిదా ప‌డుతూ రావ‌డం రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర తీసింది. ఎట్ట‌కేల‌కు వ‌చ్చే నెల 5న దీన్ని ప్రారంభించ‌నున్నారు.

అదే రోజు జీజీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసే భారీ బ‌హిరంగ స‌భ కీల‌కం కానున్న‌ది. దాదాపు ల‌క్ష‌న్న‌ర నుంచి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌న స‌మీక‌ర‌ణ చేయ‌నున్నారు. ఈ స‌భ‌లో సీఎం స్పీచ్ కీల‌కం కానున్న‌ది. చాలా రోజుల త‌ర్వాత సీఎం కేసీఆర్ ఇందూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. క‌విత ఓడిపోయిన నాటి నుంచి ఆయ‌న జిల్లా శ్రేణుల‌పై గుర్రుగానే ఉన్నారు. క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ వాయిదాకు ఇదీ ఓ కార‌ణంగా చెప్పుకుంటారు. తాజాగా క‌విత‌పై కేంద్రం ఢిల్లీ లిక్క‌ర్ స్కాం నింద‌ను మోప‌డం రాజ‌కీయంగా దుమారం రేపింది. దీనిపై ఈ రెండు పార్టీలు నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో వైరం ఏర్ప‌చుకుని బాహాబాహీగా ప్ర‌జాక్షేత్రంలో త‌ల‌ప‌డుతున్నారు. ఇందూరులో కూడా దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వ వేడుక మ‌హాస‌భ ప్ర‌సంగంలో సీఎం కేసీఆర్ రాజ‌కీయంగా ఘాటుగా స్పందించే అవ‌కాశం ఉంది. అందుకే కార్య‌క్ర‌మం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.

You missed