పసుపుబోర్డు అవసరంల లేదు.. అంతకన్నా మంచిది తెచ్చిన…రైతులు కూడా ఖుషీగా ఉన్నరు…. అంటూ అర్వింద్ ఎన్ని మాటలు చెప్పినా అటు రైతులు, ప్రజలు,ఇటు ప్రతిపక్షాలు వినడం లేదు. ఎన్నికల సమయంలో బాండు పేపర్ రాసి ఇచ్చి…తను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన విషయాన్ని ప్రస్తావించి.. బోర్డు లేకపోవడంతో పసుపు రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ అర్వింద్ ను ఇరకాటంలో పెడుతూ ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. డిమాండ్లు కొనసాగుతూనే ఉన్నారు. ఈ వరుసలో తాజాగా సీపీఐ కూడా చేరింది.
ఈ నెల 23న సీపీఐ నిజామాబాద్ జిల్లా మహాసభలు జరిగాయి. ఇందులో కొత్తగా జిల్లా కార్యదర్శిగా సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభల తీర్మానాల్లో ప్రధానమైనదిగా పసుపు బోర్డు సాధన, ఎంపీ అర్వింద్‌పై ఒత్తిడి తీసుకువచ్చి పసుపు రైతులకు అండగా ఉండాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని జిల్లా కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు. ఎన్నికల హామీలో భాగంగా బాండు పేపర్ రాసిచ్చి ఇప్పుడు మాయమాటలు చెబుతూ రైతులను వంచించిన అర్వింద్.. వెంటనే పసుపుబోర్డు తేవడానికి తనవంతు కృషి చేయాలని లేదంటే సీపీఐ ప్రజా పోరాటాలు చేసి అర్వింద్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తుందని హెచ్చరించారు.