రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన అర్వింద్
బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు
కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది
మొత్తం 27 చెక్ డ్యాంలకు 177 కోట్లు కేసిఆర్ ప్రభుత్వానివే
నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు
– అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల
హైదరాబాద్:
రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపి అర్వింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు,పెద్దవాగు పై ఇప్పటికే నిర్మించిన,మంజూరైన చెక్ డ్యాంల నిధులపై మంత్రి ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని,కేంద్ర ప్రభుత్వానివి ఒక్క రూపాయి కూడా లేదన్నారు.
కప్పల వాగు,పెద్ద వాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామో ఎంపి అర్వింద్ కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.
ఎంపి అరవింద్ లేవనెత్తిన చెక్ డ్యాంల నిర్మాణ నిధులపై ఆధారాలన్నీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ప్రజల ముందుంచారు. 10 చెక్ డ్యాంలకు 66 కోట్లు నిర్మాణానికి ఖర్చు అయితే అందులో 20 కోట్లు నాబార్డు ద్వారా రుణం తెచ్చామని,అది కూడా వడ్డీతో సహా నాబార్డు కు కేసిఆర్ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 46 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మే బరించిందని వెల్లడించారు. మంజూరైన మొత్తం 27 చెక్ డ్యాములకు 177 కోట్లలో 20 కోట్లు మాత్రమే నాబార్డు రుణం అని,మిగతా 157 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివే అని తేల్చిచెప్పారు.
ఇందులో కేంద్రానిది నయా పైసాలేదని పునరుద్ఘాటించారు.
ఓకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందనే బ్రమలో అరవింద్ ఉన్నాడన్నారు.