ఒక్కో కార్పొరేట‌ర్ మోడీ స‌భ కోసం ల‌క్ష ఇవ్వాలి. ఆపై చందాలు వ‌సూలు చేసుకోవ‌చ్చు. మామాలు నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌లు ఐదువేలు, ప‌దివేల నుంచి మొద‌లుకొని ఎంతైనా ఇవ్వొచ్చు. ఎవ‌రి ద‌గ్గ‌రైనా చందాల పేరుతో వ‌సూలు చేయొచ్చు. అవ‌స‌ర‌మైతే వారికి ర‌సీదులు కూడా ఇవ్వొచ్చు. మోడీ స‌భ‌కు ఖ‌ర్చుల‌కు డ‌బ్బు స‌మ‌కూర్చాలి. విజ‌య‌వంతం చేయాలి.

ఇదీ బీజేపీ అధిష్టానం… హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నాయ‌కులు, కార్పొరేట‌ర్ల‌కు ఇచ్చిన మ‌హ‌ద‌వ‌కాశం. వ‌సూళ్ల ప‌ర్వానికి ఇచ్చిన గ్రీన్ సిగ్న‌ల్. నిన్న మొన్న‌టి దాకా ఎలాంటి ఆదాయం లేక‌.. వ‌సూళ్లు చేసుకునే వెసులుబాటు లేక జేబుల‌కు చిల్లులు ప‌డిన వైనం త‌లుచుకుని బాధ‌ప‌డిన రోజులున్నాయి వీరికి. అందుకే మోడీ రాక నేప‌థ్యంలో న‌లుగురు బీజేపీ కార్పొరేట‌ర్ల‌ను టీఆరెస్ లాక్కోగ‌లిగింది. ఎలాంటి ఆదాయం లేదు మ‌రి వారికి. ఏం చేయ‌మంటారు. ఇప్పుడు ఇలా మిగిలిన నేత‌ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ మోడీ రాక సంద‌ర్బంగా దొరికింది. దొరికిన కాడికి ఇక బ‌రుకుడే. ఇప్పుడు ఇదే ప‌నిలో ఉన్నారు మ‌న క‌మ‌ల‌నాథులు. ఆదివారం జ‌రిగే మోడీ బ‌హిరంగ స‌భ కోసం వసూళ్ల దందాకు తెర లేపింది బీజేపీ అధిష్టానం. ఈ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంటాయో తెలియ‌దు కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ మ‌హ‌ద‌వ‌కాశాన్ని మాత్రం వ‌దులుకోద‌ల్చుకోలేదు. మొన్న‌టి దాకా ఆక‌లితో ఉన్న నేత‌లంతా ఇప్పుడు వ‌సూళ్ల కోసం బ‌రిలోకి దిగారు. మోడీ వ‌చ్చిన సంద‌ర్భంగా వ‌చ్చిన ఈ ల‌క్కీ చాన్స్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దులుకోద‌ల్చుకోలేదు.