వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ లాంటి షాడో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. తండ్రుల జాగాలో కొడుకులు, వారి తమ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వనమా రాఘవ విషయం వెలుగు చూసింది కాబట్టి.. సమాజం అంతా ముక్కున వేలేసుకుంటున్నది. మరి ఇలాంటివి బయటకు రానివెన్ని. మరుగున పడుతున్నవెన్ని.. బలవంతంగా లోపలే దాచి పెట్టి దర్జాగా బయట షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న వారెందరు..?
ఈ లెక్కలన్నీ కేటీఆర్ దగ్గరున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..? అవును. కేసీఆర్‌కు ఇవన్నీ తెలుసో లేదో తెలియదు కానీ. కేటీఆర్‌కు పక్కా తెలుసు. ఎందుకంటే రానున్న రాజ్యం ఆయన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది. వారి వారసత్వ పోకడలు ఎలా ఉన్నాయి. ఎవరికి టికెట్ ఇస్తే మళ్లీ గెలుస్తారు..? ఎంత మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు…? ఈ సర్వేలు, లెక్కలు.. కేసీఆర్‌కు ఎంత తెలుసో… కేటీఆర్‌కు అంతకన్నా బాగా తెలుసు.
ఈ మధ్య పాలనపై కేటీఆర్ ముద్ర బలంగా కనిపిస్తున్నది. మీడియా, ప్రతిపక్షం ఎవరైతే ఏందీ.. సందు దొరికితే.. కారణం చిక్కితే.. తప్పుదొర్లినట్టు పట్టుబడితే చాలు.. అరెస్టులు. చిప్పకూడు. జైలు పాలు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు. మంచి దూకుడు మీదున్నాడు కేటీఆర్. ఆలోపే పంటికింద రాయిలాగా, కంట్లో నలుసులావా వనమా రాఘవ కేసు బయటకు వచ్చింది. వెంటనే స్పందించాల్సిన కేటీఆర్… అదే దూకుడు చూపించాల్సిన కేటీఆర్.. ఎందుకనో మౌనంగా ఉన్నాడు. తనకు అలవాటు లేని సంయమనాన్ని ఆశ్రయించాడు. కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతున్నది. ఇంకా జరుగుతున్నది. మేల్కొనేలోపే భారీ నష్టం టీఆరెస్ పార్టీకి సంభవించనున్నది.
దీంతోనే సమస్య ముగిసిపోలేదు. అది కేటీర్‌కు తెలుసు. వారసత్వం ముసుగులో షాడో ఎమ్మెల్యేల దురఘాతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి బయట పడకముందే తోకలు, రెక్కలు, టికెట్లు కత్తిరిస్తే గానీ ఈ సంస్కృతికి బ్రేకులు పడవు. మరి అది కేటీఆర్‌కు సాధ్యమవుతుందా..? నియోజకవర్గాల్లో పాతుకుపోయి… అనుచరవర్గ గణాన్ని పెట్టి పోషించుకుంటున్న ఎమ్మెల్యేల గణాలు… ఈ దుర్గుణాలు వీడి.. కేటీఆర్ చెప్పినట్టు వింటారా…? పార్టీ జంప్ అంటారు.. పార్టీకి నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటారు. అదీ అసలు సమస్య. అందుకే కేటీఆర్ తన సహజ శైలికి భిన్నంగా మౌనాన్ని, సహనాన్ని ఆశ్రయించాడు.