డిసెంబ‌ర్ 31 రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు. తాగి తందనాలాడుడే. ఎవ‌రు కాద‌న్నా ఇది కూడా మ‌న క‌ల్చ‌ర్‌లో బాగ‌మై కూసుంది. ఆ రోజు మ‌జా చేసుకోనోడ్ని ఎర్రోడ్ని చూసినట్టే చూస్త‌రు. పోర‌గాళ్లైతే… ఈ త‌రం ఆ త‌రం అని కాదు. అంతా తాగాలే చిందులేయాలే. ప‌న్నెండు దాటితే న్యూ ఇయ‌న్ విషెస్ చెప్పాలే. తెల్లారే దాకా మ‌ద్యం మ‌త్తులో తిర‌గాలే. తెల్లారు జామును ప‌డుకొని ఏ ప‌న్నెండికో లేచి.. ఫ్రెష్ గా స్నానం చేసి గుడికి పోయి.. కొత్త కొత్త కండిష‌న్లు విధించుకోవాలె. రాముడు మంచి బాలుడు గా మారుతున్న వైనాన్ని కొద్ది రోజుల పాటు కొన‌సాగించాలె.

ఇదే ట్రెండు. కొన‌సాగుతున్న పాత చింత‌కాయ పచ్చ‌డి విధానం. స‌రే, ఇదంతా సోదెందుకు గానీ, ఒమిక్రాన్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఈసారి వేడుక‌లు ఉండ‌వు.. లాక్ డౌన్ ఉంటుంది. ఎట్లా..? అని తెగ గ‌బ‌రా, బెంబేలు ప‌డిపోయారంతా. కానీ మ‌న స‌ర్కార్ చాలా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్న‌ది. ఎంత కాద‌న్నా.. మ‌ద్యం దుకాణాలు రాబ‌టి మార్గాలు. ఇప్పుడు స‌ర్కారు గ‌ల్ల‌పెట్టె ఖాళీగా ఉంది. ఇబ్బ‌డిముబ్బ‌డిగా ప్ర‌క‌టించేసిన సంక్షేమ ప‌థ‌కాలేమో పీక‌మీద క‌త్తిలా వేలాడుతున్నాయి.

నెల‌కు స‌రిగ్గా పింఛ‌న్లు రావు. రైతు బంధు వేయాలె. ద‌ళిత బంధు ఒక‌టి కొత్తగా నెత్తుకెత్తుకున్న‌మాయె. కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు పైస‌లు లేవు. అవి ల‌క్ష‌ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఖ‌ర్చులు. మ‌రి ఇవ‌న్నీ ఎట్లా తీరాలె. పైస‌లు ఎక్క‌డికెళ్లి రావాలె. డిసెంబ‌ర్ 31 ఒక సువ‌ర్ణ అవ‌కాశ‌మే. ఎవ‌రు కాద‌న్నా స‌ర్కారు ఇది గుర్తించింది. ఈ అవ‌కాశాన్ని గుర్తించింది. అస్స‌లు వ‌దులుకోద‌ల్చుకోలేదు. అందుకే ఒంటి గంట వ‌ర‌కు తెరిచి ఉంచుతానంది. ఎవ‌రూ కంగారు ప‌డి.. ఒక‌ళ్ల మీద ఒక‌ళ్లు ప‌డి కొత్త సినిమా టికెట్ల కోసం కొట్లాడుకున్న‌ట్టు కొట్టుకోవ‌ద్దు. తాగినంక స‌ర‌పోక‌పోతే మ‌ల్లా రండి.. కొనండి. తాగండి. స‌త్తువుంటే ఇంటిదాకా పో.. లేక‌పోతే రోడ్డు మీదే బొర్లాడు. వైన్ షాపుల బంద్ చేసినా తాగెటోడు ఆగుత‌డా.. తాగుడు ఆగుత‌దా.. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ మ‌జా ఆగుత‌దా..? అందుకే ఇదంతా..

ఇంకా మ‌నం అస‌లు క‌థ‌కు రాలే. ఇగో క‌రెక్టుగా ఇప్పుడొస్తున్నాం. దీనిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ త‌న ఫేస్‌బుక్ వాల్‌పై తన‌దైన శైలిలో ఓ కామెంటు పెట్టాడు. తాగండి .. క‌రోనా అంటించుకోండి.. మోదీ మీద‌కు నెట్టండి అనేది క్షుప్లంగా దాని సారాంశం. స‌రే, అలా అన‌క‌పోతే ఎలా అంటారు ప్ర‌తిప‌క్ష‌పోళ్లు. కేసీఆర్ దీన్ని క‌నీసం ఎంట్రుక మందం కూడా ప‌ట్టించుకోడు. ప‌రిస్థితి అలాంటిది. కానీ ది గ్రేట్ క్రిషాంక్ మాత్రం రెచ్చిపోయి త‌నూ ఓ కామెంటు కామెంటాడు.

మొన్నే ఓ ప‌ద‌వి కూడా ఇచ్చిండ్రు క‌దా. ఊరికే ఉంటే ఎట్లా అని అనుకున్నాడో ఏమో.. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇర‌వై నాలుగ్గంట‌లూ అమ్ముతున్నారోయ్‌.. అని కొత్త విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్పాడు. వాడెవ‌డో అమ్ముతున్నాడ‌ని, మ‌నం అమ్మ‌డాన్ని స‌మర్థించ‌డం ఏదైతే ఉందో.. ఇది నీ వెర్రి.. ఆలోచ‌న లేని, అజ్ఞాన, దుందుడుకు, అసంద‌ర్భ ప్రేలాప‌నే క్రిషాంక్‌. స‌ర్కార్ స‌మ‌స్య స‌ర్కార్‌ది. తేలు కుట్టిన దొంగ ప‌రిస్థితి. మ‌ధ్యలో నీకెందుకు బాధ చెప్పు.

స‌ర్కారు చేసిన ప్ర‌తీ దాన్నీస‌మ‌ర్థించాల‌ని చూస్తారు చూడు.. నీ లాంటోళ్లు.. మీరే అస‌లైన శ‌త్రువులు మీ స‌ర్కారుకు. బ‌ట్ట‌లు చింపుకుని మంచి మార్కులు కొట్టాయాల‌నే యావే త‌ప్ప‌.. ఆ సంద‌ర్బం ఏంటీ..? మ‌నం స్పందిచాలా వ‌ద్దా అని క‌నీసం కామ‌న్ సెన్స్ లేక‌పోతే ఎట్లా…?