రాను రాను రాజుగుర్రం గాడిదైంది… నమస్తే తెలంగాణ పరిస్థితి అట్లనే అయ్యింది. కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన మానస పుత్రిక నమస్తే తెలంగాణను చదివే నాథుడు లేడు. సర్క్యూలేషన్ స్కీంపైనే ఆధారపడి బలవంతంగా రీడర్లకు అంటగట్టే కార్యక్రమం మళ్లీ మొదలైంది. అల్లం నారాయణ, కట్టా శేఖర్ రెడ్డి, మార్కండేయ ఉన్నప్పటి నుంచే ఈ స్కీంలున్నాయి. అప్పుడు కనీసం 30శాతం రీడబులిటీ ఉండేది. ఇప్పుడు 99శాతం చందా కాపీలే. అంటే కాంప్లిమెంటరీగా పేపర్‌లు పంపిస్తారు. వాళ్లు చదవనీ, చదవకపోని. అసలు చదివేవాడుంటే కదా.
రద్దీకి పేపర్ మంచి ఇస్త్రీ చేసి పంపినట్టుగా వెళ్తుంది. దీనికి రద్దీ వద్ద ధర ఎక్కువ పలుకుతున్నది. కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మరింత అవస్థకు లోనై అథఃపాతాళానికి చేరుకున్నది. రిపోర్టర్లకు ఈ చందా టార్గెట్లు గుదిబండలా మారాయి. ఎవరినో టీఆరెస్ లీడర్లను పట్టుకుని బల్క్‌గా కాపీలు చేపిస్తారు. కానీ అడ్రసులు దొరకవు. వాటి కోసం ఎన్నో తిప్పలు. పోనీ ఎవరివో ఒక అడ్రస్ ఇస్తే.. అక్కడికి పేపర్ సరిగా వెళ్లదు. వెళ్లకపోయినా అడిగేవాడుండడు. పేపర్ పడ్డా చదివే వాడుండడు. ఇదంతా ఓ స్కాం. స్కీం స్కాం.
కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడికో తీసుకెళ్తానని పాతవాళ్లందరినీ రోడ్డు పాలు చేసి.. తన టీంను .. వేలకు వేలు జీతాలు ఎక్కువిచ్చి మరీ తెచ్చిపెట్టుకున్నాడు. ఏం చేశావయ్యా.. అంటే.. ఏమీలేదు. మరింత దారుణానికి పరిస్థితులు దిగజారే నిర్ణయాలు.. ఒంటెత్తు పోకడలు, పట్టింపులేనితనం, కేసీఆరే నన్ను మెచ్చకుంటాడు.. నేనేం చేసినా చెల్లుబాటవుతుంది.. అనే మిడిసిపాటు.. అంతే. అంతకు మించి ప్రతిక బాగు కోసం కొత్తసారు వచ్చి చేసిందేమీ లేదు. మరింత భ్రష్టు పట్టించడం తప్ప. దీనిపై టీఆరెస్ పెద్దల అజమాయిషీ ఎవరిదీ లేదు. కేటీఆర్, కవిత పట్టించుకోరు. కేసీఆర్ నిలువెత్తు ఫోటో పెట్టి గంపకింద కమ్మేస్తారు. అంతే.
ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ బలవంతపు చందా స్కీం నుంచి ఎస్జీవీ శ్రీనివాస రావు తన వల్ల కాదంటూ చేతులెత్తేశాడు. బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీష్‌కు అప్పగించారు. ఆయన బ్యూరో ఇన్ఛార్జులకు టార్గెట్లిచ్చి ఉరకులు పరుగులు పెట్టిస్తున్నాడు. ఆ బ్యూరో ఇన్చార్జిలు కంట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. చేస్తారా..? చస్తారా అనే రేంజ్‌లో దబాయింపులు. అంతో ఇంతో రిపోర్టర్లతో సఖ్యతగా ఉండే ఓరుగంటి ఈ దెబ్బతో వారికి విలన్‌గా మారనున్నాడు. చందా కాపీల టార్గెట్ల విషయంలో సక్సెస్ కాలేదు కాబట్టిఆ వైఫల్యాన్ని ఓరుగంటి మెడకు చుట్టి సాగనంపుతారేమో. ఇప్పుడక్కడ జరిగే కుళ్లు కుతంత్రాలన్నీ అవే. ఒకరిపై ఒకరు పొగబెట్టుకోవడం.. వెళ్లగొట్టుకోవడం. అంతే . పత్రిక అభివృద్ధి మాత్రం ఎవరికీ పట్టదు.
రాను రాను రాజు గుర్రం గాడిదైంది. కేసీఆర్ సారు.. ఇదీ మన పత్రిక పరిస్థితి.