మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అధిష్టానం మీద అలక వహించింది. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి రెండు సార్లు మాటతప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయన మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని. పదవి వచ్చే వరకు ఓపిక పడదామని అనుకుంటూనే.. పార్టీకి దూరం దూరంగానే ఉంటూ వస్తున్నదామె. తనకు వాస్తవంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని రెన్యూవల్ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం.
కానీ కొన్ని మధ్యంతరంగా వచ్చి పడిన సమీకరణలు పరిస్థితులను మార్చేశాయి. తర్వాత స్థానిక సంస్థల కోటాలోనైనా కచ్చితంగా వస్తుందని భావించింది. అధిష్టానం ఆమె పేరును ఖరారు చేసింది. అన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రాజ్యసభకు వెళ్దామని చివరి వరకు అనుకున్న కవిత చివరి నిమిషంలో నిర్ణయం మార్చేసుకున్నది. తనే మళ్లీ లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా నిలబడేందుకు సిద్దపడటంతో ఆకుల లలితకు నిరాశే ఎదురయ్యింది.
దీంతో అప్పటి నుంచి ఆమె అన్యమనస్కంగానే ఉంది. పార్టీ నేతలతో, కార్యకర్తలతో అంటీ ముట్టనట్టుగానే ఉంది. ఆ తర్వాత అధిష్టానం ఆమెకు రాజ్యసభ ఇస్తామని బుజ్జగించింది. కానీ, రాజ్యసభ ఎంపీగా తనకు అవకాశం రాదనే విషయం ఆమె ఆనాడే గ్రహించింది. ఈ సీటు కోసం ఎంతో మంది పోటీలో ఉన్నారు. వారందరినీ కాదని, కేసీఆర్ తనకు ఇస్తాడని ఆమె అనుకోవడం లేదు. దీంతో ఏదైనా పదవి ఇస్తారని మాత్రం నమ్మకంతో ఉంది.
ఇటు పార్టీని వదలి వెళ్లలేక, అటు కేసీఆర్ ఎప్పుడు పదవి ఇస్తాడోననే ఎదురుచూపుల మధ్య ఆమె ఓపికగా ఎదురుచూస్తున్నది. ఏదైనా కార్పొరేషన్ పదవి రాకపోతుందా అని నమ్మకంతో ఉన్నారంతా. మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి .. ఆకుల లలితను పార్టీకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆమె గతంలో ఆర్మూర్ నుంచి పోటీ చేసింది.ఆమె గెలిచే సీటును వదులుకొని సీఎం కేసీఆర్ హామీ మేరకు టీఆరెస్‌లో చేరింది. ఇప్పుడిలా ఎటూ కాకుండా అయిపోయింది పరిస్థితి అని అలక వహించింది. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఆమెకు త్వరలో ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని కచ్చితంగా చెబుతున్నారు.