నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ విషయంలో చివరకు వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. నిన్న రాత్రి అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. కానీ నిజామాబాద్ విషయంలో డైలామా కొనసాగింది. సస్పెన్స్ చివరి వరకు నడిపించారు. మధ్యలో ఆకుల లలిత పేరును తీసుకొచ్చారు. మీడియా అంతా ఆమె పేరు రాసేసింది. కానీ వాస్తవం వెబ్‌సైట్ మాత్రం కవితకే అవకాశం ఉందని చెప్పింది. అదే నిజమైంది. కవిత పేరును కేసీఆర్ ఖరారు చేశాడు.
ఢిల్లీలో ఉన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇద్దరూ సమాలోచనలు జరిపి చివరగా ఆమె పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. ఆమె రేపు నామినేషన్ వేయనున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీగా చేసినా.. మంత్రి పదవి రాలేదు. కాల పరిమితి ముగిసిపోయింది. మళ్లీ ఈ స్థానాన్ని ఆమెకే ఇవ్వాలని అనుకున్నారు. కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి వేస్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయ్యింది. కవిత అభిప్రాయం కూడా అదే. అలా కుదరకపోతే రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావించింది. ఆ విషయంలో కూడా సమాలోచనలు జరిపారు. రేపు నామినేషన్లకు చివరి తేదీ అనే వరకు కూడా నిజామాబాద్ అభ్యర్థి విషయంలో తీవ్ర సస్పన్స్ కొనసాగింది. చివరగా ఆమెకే మొగ్గు చూపారు కేసీఆర్. కేటీఆర్‌లు.
ఆకుల లలితకు మొండి చేయే మిగిలింది. ఆమెకిచ్చిన వాగ్దానం మేరకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చేమే. క్లారిటీ లేదు. కానీ కవిత అభ్యర్థిత్వం ఓకే కావడం ఇటు జిల్లా రాజకీయాల్లోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమెకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమనే విషయంపైనా కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టే. ఇక జిల్లా రాజకీయాల్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. మొన్నటి వరకు ఆమె లేని ఇందూరు టీఆరెస్‌లో నిస్తేజం అలుముకున్నది. అభిమానులు, టీఆరెస్ కార్యకర్తలు తమను పట్టించుకునే వారు లేరనే వైరాగ్యంలో ఉన్నారు.
జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన పరిధిలో తాను పనిచేసుకుని ఎవరికీ ఇబ్బందులు రాకుండ చూసుకున్నాడు. ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్చనిచ్చి వారిని కాదని ఏ పనీ చేయలేదు. అటు బాల్కొండ నియోజకవర్గ అభివృద్ఢిపైనా, ఇటు జిల్లా అభివృద్ధి, రివ్యూలు, కీలక సబ్జెక్టులపైనే దృష్టి నిలిపాడు. ఇప్పుడు కవితకు మంత్రి పదవి ఇస్తే ఆమె ఉమ్మడి జిల్లాలో కీలక పవర్ సెంటర్‌గా మారనుంది. పార్టీలో కొత్త ఉత్తేజం రానుంది. ఆశావహులు, అసంతృప్తి వాదులకు ఈ పరిణామం సంతోషాన్నే కలిగిస్తున్నది. నిస్తేజం గా ఉన్న ఇందూరు గులాబీలో కదలిక రానుంది. నూతనోత్తేజం రానుంది.