గతంలో ఎన్నడూ లేని విధంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల మాదిరిగానే .. లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో చివరి వరకు తేల్చడం లేదు కేసీఆర్. ఎల్లుండి నామినేషన్లకు ఆఖరి తేదీ కాగా.. చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రారు.
దీంతో రేపే నామినేషన్లకు అవకాశం ఉంది. ఈ రోజు అర్థరాత్రి వరకు క్లారిటీ రావొచ్చని చూస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిపోయాడు. మరో మూడు రోజుల వరకు రాడు. కానీ పేర్లు ఫైనల్ చేసి వెళ్లాడన తెలుస్తోంది. నిజమాబాద్ నుంచి ఎమ్మెల్సీగా మరోసారి కవితకే ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఇస్తే కచ్చితంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న రాజకీయ ఈక్వేషన్లో అది సాధ్యమవుతుందా..? అనే తర్జన భర్జన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆపినట్టు తెలుస్తోంది.
ఒక్క నిజామాబాదే కాదు.. 12 స్థానాల్లో ఓ రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కవిత ఈసారి ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభకు వెళ్తుందని భావించారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ లోకల్ బాడీకి చెందిన ఎన్నిక కావడంతో .. జిల్లాపై ఆమెకు పట్టు ఉండాలని, జిల్లాను వీడి రాజకీయాలు చేయడం బాగుండదనే అభిప్రాయం మెజారిటీగా వచ్చింది. రానున్న జనరల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవాలంటే కవితకు పట్టు ఉంటేనే సాధ్యమవుతుందనే అభిప్రాయమూ కేసీఆర్ కు ఉంది.
ఈ నేపథ్యంలో ఆమెను నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నారు. ఆమె ఎమ్మెల్సీ అయ్యిందంటే కేబినెట్లో బెర్త్ ఖారరైనట్టే లెక్క. ఈ మేరకు లెక్కలు.. సమీకరణలు అన్నీ కేసీఆర్ సమాలోచనలు చేసుకుని పెట్టుకున్నాడనే ప్రచారమూ జరుగుతున్నది. కవితకు ఎమ్మెల్సీగా ఇవ్వకపోతే.. ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి లు ఇద్దరూ ఈ స్థానం కోసం ఆశిస్తున్నారు. మోహన్‌రెడ్డి కూడా తనకు కవిత హమీ ఇచ్చి ఉన్నారనే ఆశతో ఉన్నాడు. ఈగ గంగారెడ్డి చివరి వరకు ప్రయత్నం చేసి అధిష్టానం నిర్ణయానికే వదిలేశాడు. డాక్టర్ మధుశేఖర్ మొత్తంగా ఆశలు వదులకున్నాడు. టీఆరెస్తో అంటీముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నాడు.
అసంతృప్తులు ఇలా ఎవరికి వారే లెక్కలు వేసుకుంటుండగా.. చివరకు కవిత పేరే ఖరారయ్యేలా కనిపిస్తుంది. ఇంకా ఎవరికీ కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో అందరిలో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ రోజు అర్థరాత్రి వరకు క్లారిటీ రావొచ్చంటున్నారు. కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవి ఇస్తేనే జిల్లాలో టీఆరెస్ మరింత బలోపేతం అవుతుందని ఇక్కడ గులాబీ శ్రేణులు అనుకుంటున్నారు. ఓవైపు బీజేపీ బలపడుతున్నది. మరోవైపు కాంగ్రెస్‌లో మెల్లగా చలనం వస్తున్నది. ఈ నేపథ్యంలో కవిత మంత్రిగా ఉంటే పార్టీ ఉమ్మడి జిల్లాలో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. దీన్ని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
