రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేద్దామని బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఎంత ప్రయత్నించినా.. కేంద్రం మాత్రం గండికొడుతూనే ఉంది. అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత, బండి సంజయ్ బీజేపీ చీఫ్ అయిన తర్వాత.. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. అర్వింద్ పచ్చి బూతులను నమ్ముకున్నాడు. కేసీఆర్‌ను పచ్చిగా, ఘాటుగా, మోటుగా ఎంత తిడితే అంత తనకూ , పార్టీకి వ్యక్తిగత మైలేజీ వస్తుందని భావించాడు. అదే పంథాను అనుసరిస్తున్నాడు.
ఆ మాటలు మీడియాలో రాయడానికి కూడా వీలుపడనివి. కానీ ఇప్పుడు మీడియాను ఎవరు నమ్ముకున్నారని. అంతా సోషల్ మీడియానే. అందులోనే వైరల్. బీజేపీకి యూత్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వారే వీటిని మోస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో కేంద్రం వైఖరి ఒకలా ఉంటే.. ఇక్కడ మాత్రం వీరిద్దరూ బీజేపీని బలోపేతం చేయాలంటే కేసీఆర్‌ను టార్గెట్‌ను చేయడమేనని డిసైడ్ అయ్యారు. తిట్ల దండకాన్నే నమ్ముకున్నారు. బట్టకాల్చి మీదేయడమే పరమావధిగా భావించారు. అబద్దాలు వల్లెవేయడమే శరణ్యమని డిసైడ్ అయ్యారు.
కానీ కేంద్రం తీసుకునే నిర్ణయాలు మాత్రం వీరి ఆశలకు, అవకాశాలకు, ప్రయత్నాలకు గండి కొడుతూనే ఉంది. నిన్న యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని తేల్చి చెప్పేసింది. పప్పు దినుసులు, నూనె గింజలు పండించాలని సూచించింది. దీంతో బండి సంజయ్ టార్గెట్ అయ్యాడు. యాసంగిలో వరి వేయండి.. కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తాను. కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తానని నోటికేదొస్తే అది మాట్లడిండు బండి. కానీ నిన్న కేంద్రం ప్రకటనతో మరోసారి అబద్దాల డొల్లతనం బయటపడ్డది. కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కూడా బాగానే మోశాడు బండి సంజయ్. తప్పదు కదా. అద్బుతమన్నాడు. ఆ లెక్కకొస్తే కేసీఆర్ జై కొట్టాడు ఒకానొక దశలో.
ఇప్పుడు ఈ చట్టాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెనక్కి తీసుకున్నాడు మోడీ. వారి జాతీయ రాజకీయ అవసరాలు వారివి. అంతిమంగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ మాత్రం వెర్రి పుష్పాలే అవుతున్నాయి. ఎన్ని జాకీలు పెట్టి లేపినా బీజేపీ ఇక్కడ లేచేలా లేదు. వీరి అబద్దాల మాటలు ప్రజలూ నమ్మేలా లేరు.