ఆడపిల్ల ఒక వయసుకి వచ్చాక ఆమె శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల కావడం వలన మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పునరుత్పత్తి కి సంభందించిన అవయవాల పని ప్రారంభం అవుతుంది.ఈప్రక్రియలో భాగంగా మొదటిసారిగా బీజకోశం నుండి వెలువడిన మొదటి అండం తన సమయం దాటిపోయాక గర్భాశయ గోడలను వదిలి బయటకు పోతుంది.ఆ సమయంలో కొంత రక్తము కూడా పోతుంది. దీనినే స్థానిక భాషలో పెద్దమనిషి ఆవడం అంటారు.
ఈ పెద్దమనిషి అవడం అనేది నిజంగా నిజం కాదు. చిన్న పిల్లల్లోకూడా ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావడం అనేది మనము వారికి పెట్టె ఆహారమువలన జరుగుతుంది.పిజ్జాలు , బర్గర్లు , హార్మోను ఇంజక్షనులు ఇచ్చిన కోడి మాంసాలు ఇతర జంక్ ఫుడ్ లోని కొవ్వు పదార్ధాలు , సరయిన వ్యాయామం లేకపోవడం వలన, కొంత వంశపారంపర్యంగా కూడా రావచ్చును.
1. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ మాత్రమే మాత్రమే.
2. ఆమాత్రందానికి, మైకులు పెట్టి “మా పిల్ల పెద్దమనిశయిందొహో….అని అల్లరి పెట్టడం ఎంత దారుణం…ఎంత తప్పు?
3. పూర్వకాలంలో అంటే పేపర్లు రేడియోలు టీవీ లు నెట్ సౌకర్యం సెల్ ఫోన్ ఉత్తరాలు లేని రోజుల్లో బాల్య వివాహాలు జరిగే రోజుల్లో “మా ఇంట్లో పెద్దమనిషైన పిల్ల ఉందీ….ఆమెకు తగిన వరుడునిచ్చి పెళ్లి చేద్దాము” అనే ఉద్దేశ్యంతో ఫంక్షన్ పెట్టేవారు. ఆరోజుల్లో అలా అందరికీ తెలిసేలా కార్యక్రమం చేయడం అవసరం.
4. ఈ రోజుల్లో అలా చేయడం చాలా తప్పు.
మనం బాల్య వివాహాలు మానేశామ్.
చిన్న వయసులోనే పెద్దమనిషి అవడం అనేది ఆ బిడ్డకు చాలా అసౌకర్యం.ఇలా ఫంక్షన్ చేయడం వలన , అనవసర ప్రాధాన్యత ఇచ్చి ఆమెకు లేని ఆలోచనలు కల్పించదమే అవుతుంది.
5.తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ముందుగా గైనకాలజిస్ట్ దగ్గర చూపించి ఆమె శారీరక స్థితి, ఆరోగ్యవిషయం సరిగా వుందా లేదా అని తెలుసుకోవాలి. అవసరమైతే పాపకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమె శరీరంలో ఏమి జరుగుతుందనేది ఎంతవరకు చెప్పాలో అంతా చెప్పించాలి..చిన్నపిల్లల సైకాలాజిస్ట్ తో కూడా మాట్లాడించడం మంచిది..
6. ఫంక్షన్ చేసి డబ్బులు పాడుచేసేబదులు వాళ్ళ పేరున ఒక 10y ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఆమె భవిష్యత్ కి ఉపయోగపడుతుంది.
7. అనాగరికమైన పద్ధతులు పిల్లలపై ప్రయోగించకండి.అంటే, కప్పులకొద్దీ నూనె తాగించడం ,వద్దంటున్నా నోట్లో బెల్లం కుక్కేయడం , ఆకులమీద, చాపలమీద రోజులతరబడి కూర్చోబెట్టడం , మరిముఖ్యంగా రోజులతరబడి స్నానం చేయించకపోవడం, వంటరిగా గదిలోపెట్టి ఉంచడం లాంటి పనులవలన పిల్లలలో ఒకరకమయిన భయాన్ని , అయోమయాన్ని , అభద్రతా భావాన్ని కలగజేసినవారం అవుతాము.
8.ఇలాంటి ‘అతి’ చర్యలవలన పిల్లలు తమకేదో జరగరానిది జరిగిందని ,తాము ఏదో తప్పు చేసినట్లు భావించే అవకాశం ఉంది.
9.అమ్మాయి కి ప్యుబర్టీ దశకు చేరుతున్నపుడే వారి శరీరంపై వారికి అవగాహన కలిగేలా చెప్పడం మంచి పద్ధతి.మనకు అంత పరిజ్ఞానం లేనపుడు డాక్టరు ద్వారానో చైల్డ్ సైకోలజిస్ట్ ద్వారానో చెప్పించాలి. ముందు తల్లిదండ్రులకు తెలిస్తే పిల్లలకు వివరించగలుగుతారు.
ఆధునిక యుగంలో వుంటూ అనాగరికుల్లా ప్రవర్తించడం ఏంబాగుంటుంది ఆలోచించండి
పి జె సునీల్