మొన్నటి వరకు ఎవరూ దిక్కులేరు ఆ శాఖకు. మొన్నటి వరకు ఏంది..? అసలు మొదటి నుంచీ దిక్కుమొక్కూ లేని శాఖ ఏదైనా ఉందంటే.. అది కీలకమైన ఈ ఆరోగ్య శాఖే. ఇంత కీలకమైన శాఖపై ఈ ప్రభుత్వమే కాదు.. ఏ సర్కారైనా ఉదాసీనవైఖరే ప్రదర్శిస్తూ వచ్చింది. బడ్జెట్లో ఈ శాఖకు జీతాల కోసం కేటాయింపులు తప్ప.. అంతకన్న అదనంగా పెద్దగా కేటాయింపులేమీ ఉండవు.
ఆది నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఈ శాఖకు అతీగతీ లేదు. మంత్రులు మారినా.. పరిస్థితిలో మార్పులేదు. అధికారులదే ఇక్కడ ఇష్టారాజ్యం. పెద్ద దిక్కు ఎవరూ లేని ఈ శాఖ..చెప్పేవాడులేక అంతా అవినీతి, నిర్లక్ష్యంతో కూరుకుపోయింది. ఉన్నతాధికారుల దానికే అలవాటు పడ్డారు. సర్కారు పెద్దల ఆశీస్సులు, మెప్పు పొందితే చాలు.. ఇక ఏం చేసినా చెల్లుతుందనే బాగా తెలుసుకున్నారు.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడిన తీరు గమనిస్తే అర్థమవుతుంది ఈ శాఖ ఉన్నతాధికారులకు ఎంత శ్రద్ధ, బాధ్యత ఉన్నాయో…? ఒక్కోసారి పొలిటికల్ లీడర్లను మించి మట్లాడిన సందర్భాలున్నాయి ఈ శ్రీనివాసరావు. కరోనా వచ్చి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే వీరికి పట్టింపు ఉండదు. ఏదో మాట్లాడతారు. సర్కారుకు ఏవో లెక్కలు చెబుతారు. తప్పుదారి పట్టిస్తారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ముందుకు కదలని ఫైళ్లు.. మంత్రి ఉన్నా లేని కిందే జమ. ఇలా ఈ శాఖ భ్రష్టు పట్టిపోయింది. ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపాల్లా మారాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ అమలు ఒకటి చేశారు తప్ప.. ఆ తర్వాత వీటి గురించి ప్రభుత్వం ఏనాడో ఆలోచించడం మరిచిపోయింది. గోరంత దానికి కొండంత ప్రచారం మాత్రం బాగా చేసుకునే అలవాటు మాత్రం అబ్బింది. మసిపూసి మారేడుకాయ చేయడం ఉన్నతాధికారుల నేర్చుకున్నారు. పెద్ద దిక్కు లేక ఈ వ్యవస్థ అంతా అగమ్య గోచరంగా మారింది. ఇవాళ హరీశ్ మొదటిసారి ఆరోగ్య మంత్రిగా సమీక్ష జరిపాడు. మెల్లగా దీనిపై నజర్ పెడుతున్నాడు. కొత్తలో కొంత హల్ చల్ ఉంటుంది. కామన్. కానీ ఎప్పట్లాగే కొన్ని రోజులకే ఈ వ్యవస్థ మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడం ఖాయం. దీన్ని మార్చడం అంత ఈజీ కాదు. అది హరీశ్‌తో కూడా సాధ్యం కాదు…
