రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో, కలెక్టరేట్ల వద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్షలకు దిగనుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమని చెప్పిన నేపథ్యంలో .. ఈ సీజన్‌లో వరి వేయొద్దని కేసీఆర్ రైతులకు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ తమ పార్టీ మైలేజీ కోసం టీఆరెస్‌ను వదలడం లేదు. వరి వేసుకోండి.. కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తాం.. అని బండి సంజయ్ కామెంట్ చేయడం.. కేసీఆర్ మండిపడి రెండు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడం.. అదే ఊపులో ఈ రోజు ధర్నాకు పిలుపివ్వడం చకాచకా జరిగిపోయాయి.
తమను రైతుల వద్ద దోషిగా నిలపాలని చూసిన బీజేపీకి గుణపాఠం చెప్పి.. కేంద్రమే ఇదంతా చేస్తున్నదని చెప్పడానికి రైతుల మద్దతు కూడగట్టుకునేందుకు టీఆరెస్ ఇదంతా చేస్తున్నది. దీని వల్ల ఒనగూరే ప్రయోజనమూ ఏమీ లేదు. ఇదంతా పొలిటికల్ స్టంట్. నిన్ననే మనం చెప్పుకున్నాం. ఇక్కడ విషయం ఇది కాదు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షకు దూరంగానే ఉంటున్నది.
గతంలో రెండేండ్ల కింద కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొన్నది. కానీ ఈసారి దూరంగా ఉంటున్నది. ఇదే ఇప్పుడు చర్చ. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆమెను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తారనేది గ్యారెంటీ. మంత్రిగా అవకాశం వస్తుందనేదీ నమ్మకమే. కానీ ఈ సమయంలో ఆమె ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఇదొక్కటే కాదు.. ఆమె కొంత కాలంగా ముబావంగా ఉంటూ వస్తున్నారు. రక్షా బంధన్ నుంచి ఆమె అంటీ ముట్టనట్టుగా ఎవరికీ అందుబాటులో లేకుండానే ఉంటున్నారు.
మొన్న దసరాకు జిల్లాలో ఎక్కువ సమయం కేటాయించారు. ప్లీనరీకీ కూడా హాజరుకాలేదు. ఈ రోజు జరిగే దీక్షలో పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఆమె ఎవరినీ కలవడం లేదు కూడా. బహుశా.. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత .. మంత్రి వర్గ విస్తరణ తర్వాత గానీ ఆమె పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా లేదు.