ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు….
“పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ కిరీటాలు తొడగాలి. విలేఖరులను నిషేధించడం, కేసులు పెట్టడం, సమాచార ప్రసార సాధనాలనే అడ్డుకోవడం వంటి ఆరితేరిన చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అనుభవాన్ని గడించిన సంగతి తెలిసిందే. పత్రికాగోష్ఠికి హాజరయిన విలేఖరులలో గిట్టని వారిని ప్రత్యేకించి వేలెత్తి చూపి, మరొకసారి రావద్దు అని చెప్పిన సంస్కారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో చూశాము. తెలంగాణ సిఎంకి అయితే, అదొక అలవాటు. మీడియా సంస్థలను పాతాళానికి తొక్కేస్తామని బహిరంగంగా మాట్లాడగలిగిన వ్యక్తిత్వం ఆయనది. విధానాలు నచ్చని సమాచార, ప్రసారసాధనాల సంస్థలపై కార్పణ్యం వహించడం ఆయన పద్ధతి. వాటికి ప్రకటనలు ఇవ్వకుండా, కార్యక్రమాలకు ఆహ్వానాలు ఇవ్వకుండా వేధించడం ఆ కక్షకు వ్యక్తీకరణలు. కానీ, నీ ఆహ్వానం మీద, నీ మాటలు విందామని వచ్చిన పాత్రికేయులను హీనపరచడం ఏమిటి? పాత్రికేయ సంఘాలు, పెద్దలు, అక్కడే ఉన్న సాటి విలేఖరులు ఎందుకు ఈ ధోరణిని నిరసించడం లేదు? పైగా, పగలబడి నవ్వడాలు కూడా.
చంద్రశేఖరరావు జనరంజక ప్రసంగ ధోరణిలో విలేఖరులను అవహేళన చేయడం ఒక ముఖ్యమైన భాగం. రిపోర్టర్లపై పంచ్‌లు, రిపోర్టర్‌కు వార్నింగ్.. ఇటువంటి శీర్షికలతో యూట్యూబ్‌లో ఎన్ని విడియోలు ఉన్నాయో చూస్తే, ఇది అరుదుగా జరిగేది కాదని తెలుస్తుంది. పాత్రికేయులతో చనువుగా ఉండవచ్చు, స్నేహం పెంచుకోవచ్చు. ఛలోక్తులు విసురుకోవచ్చు. కానీ, అవమానించకూడదు. విలేఖరే తన ప్రత్యర్థి అన్నట్టుగా ఎదురు ప్రశ్నలు వేయకూడదు. ఏ పత్రికాసంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆ సంస్థతో తనకు ఎటువంటి సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రసంగీకుడు పద్ధతి తప్పి ప్రవర్తించకూడదు. పత్రికాసమావేశానికి వచ్చిన పాత్రికేయులు దూతల వంటివారు. సమావేశంలో చెప్పినదాన్ని నమోదు చేసుకుంటారు. తాము కోరిన సమాచారాన్ని అడిగి పొందుతారు. అందులో విలేఖరుల వ్యక్తిగతమేదీ ఉండదు.
ఇటీవల జరిగిన రెండు పత్రికాసమావేశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి విలేఖరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొన్ని: ‘‘నిపుణులా, ఎవడా నిపుణుడు, తీస్కరాపో, ఏడ పన్నడో తీస్కరా పో’’, ‘‘ఎవరేం జెబితే అది రాసుడు గాదు’’, ‘‘నీగ్గూడ ఉండాలె గదనయ్యా జ్ఞానం’’. అంతమంది మధ్యలో ఆ మాటలు వినవలసి రావడం విలేఖరికి ఎంత బాధగా ఉంటుంది? ఇట్లా అవమానకరంగా మాట్లాడడంలో, వ్యక్తిగత అహంకారం సరే, ప్రశ్నలు వేయడానికి ఎవరూ సాహసించకుండా నిరోధించే ప్రయత్నం కనిపిస్తుంది. ఏడాది, రెండేళ్ల కిందటి పత్రికా సమావేశాల్లో ముఖ్యమంత్రి వాక్చాపల్యం ఇది: ‘‘ఎక్స్‌ట్రా లెందుకయ్యా’’, ‘‘ఇదెక్కడి ప్రశ్ననయ్యా బాబు, ప్రశ్నలడగడం రాదు, ఏం రాదు’’, ‘‘మీకు గ్యారంటీ కరోనా తాకాలని శాపం పెడుతున్నా’’, ‘‘ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇది, ఇదో ప్రశ్ననా, ఏం ట్రయినింగ్ ఇచ్చిన్రు మీ పత్రికలో’’, ‘‘నువు కెసిఆర్‌తో పెట్టుకోలేవు, జాగ్రత్త’’.
పాలకులకు ఇంత చులకన భావం ఉండడానికి పత్రికారంగం స్వయంకృతం కూడా ఉండవచ్చు. కాదనలేము. కానీ, ఎంత కాదన్నా, జర్నలిజం రాజకీయాలంత చెడిపోలేదు కదా? మరి, పాత్రికేయులు రాజకీయవాదులను, పాలకులను గౌరవిస్తూనే ఉన్నారు కదా? అభిప్రాయ భేదాలతో నిమిత్తం లేకుండా, ఉదాత్తమైన వ్యవహారసరళితో పత్రికారచయితలు, రాజకీయవాదులు మెలగడం ఒక విలువ. నాయకుడిని ఎంతటి తీవ్రమైన ప్రశ్న వేయగలిగే ధైర్యాన్ని ఆ విలువ, వాతావరణం ఇస్తాయి. ప్రశ్నే మెచ్చని వారు, పాత్రికేయులను కేవలం వినిరాసే లేఖకులుగా పరిగణిస్తారు. తమతో అమర్యాదగా వ్యవహరించే రాజకీయనేతలను, పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి. “
P V Kondal Rao
