గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓ మంచి అవకాశం వచ్చిందనుకున్నారంతా. ఇక ఉద్యమకారులకు, యువతకు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మరించినంక గెల్లు గెలువకపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్కడ సీన్ రివర్సయ్యింది. కోట్లు కుమ్మరించినా విజయం వరించలేదు. ఓ ఉద్యమకారుడిని గెలిపించేందుకు మరో ఉద్యమకారుడిని ఓడగొట్టామనే ఫీలింగ్ ఉద్యమకారుల్లో వచ్చింది. ఎలాగైన గెల్లుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యమమే లేవనెత్తారు. కానీ, కేసీఆర్ వింటాడా? పట్టించుకుంటాడా?
ఈటలను ఎలాగైనా ఓడగొట్టాలన్నది కేసీఆర్ ధ్యేయం. గెల్లు గెలుపు కూడా అందులో మిళితమై ఉంది. కానీ ఈటల గెలిచాడు. కర్మకాలి గెల్లు ఓడాడు. ఇక మళ్లీ టీఆర్ఎస్ అధిష్ఠానం గెల్లు ముఖం చూస్తే ఓటు. కానీ ఈ గెలుపు కోసం కేసీఆర్ పదవులిస్తానని ఇచ్చిన హామీలు మాత్రం అతని మెడకు చుట్టుకున్నాయి. అవన్నీ నెరవేర్చే బాధ్యతను తీసుకున్నాడు. ఈటల రాజేందర్ గెలిచినా.. అక్కడ అతన్ని డమ్మీ చేయాలనుకుంటున్నాడు కేసీఆర్. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు గవర్నర్ కోటా ను ఎంచుకుని భంగపడ్డాడు. అయినా ఏమాత్రం వెనకడుగువ వేయలేదు.

ఎమ్మెల్యే కోటా నుంచి కౌశిక్‌ను ఎమ్మెల్సీ చేసేందుకు రంగం రెడీ చేశాడు. హుజురాబాద్ కు మళ్లీ కేబినెట్లో చోటిచ్చి ఈటలకు చెక్ పెట్టాలనే కసితో ఉన్నాడనే ప్రచారం జోరందుకుంది. మీడియాలో కూడా వార్తలొస్తున్నాయి. కానీ కౌశిక్ వల్ల కేసీఆర్‌కు చాలా చెడ్డ పేరు వచ్చింది. గవర్నర్ దగ్గర ముఖం చెల్లలేదు. కౌశిక్ వల్లే గెల్లు ఓడాడనే విశ్లేషణలూ బోలెడున్నాయి. అయినా కేసీఆర్ మొండి పంతం వీడటం లేదు. గెలుపు కోసం నెలల తరబడి శ్రమకోర్చిన హరీశ్‌కూ వైద్యారోగ్యశాఖను కట్టబెట్టాడు. ఎన్నికలప్పుడు పార్టీలో చేర్చుకున్న ఎల్. రమణకూ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటాడనే ప్రచారం ఉంది. ఇలా అందరికీ న్యాయంచేస్తున్నాడు. కానీ గెల్లును మాత్రం కరివేపాకులా తీసేయారు. ఆటలో అరటిపండులా మారింది గెల్లు పరిస్థితి. పాపం….
