ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్‌కు అప్పగించాడు సీఎం కేసీఆర్. అసలు ఈ శాఖ అంటేనే ప్రభుత్వానికి పెద్ద జోక్‌గా మారినట్టుంది. అంతకు మించి నిర్లక్ష్యం కూడా ఉన్నట్టుంది. ప్రజారోగ్యం అంటేనే ప్రభుత్వాలకు పట్టనట్టుంది. ఏ పార్టీ సర్కారులో ఉన్నా.. ఈ శాఖ మాత్రం అనాథగానే ఉంటుంది. ఈ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయమేమీ రాదు.. కానీ ఖర్చు మాత్రం తడిసిమోపెడవుతుంది. అందుకు కాబోలు ప్రభుత్వానికి ఈ శాఖ అంటే పెద్దగా గిట్టదు. పట్టదు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య శాఖ అనాథగానే ఉంది. దీనికి తోడు మన దరిద్రానికి కరోనా వచ్చింది. ఇంకేముంది .. ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ కాదు కదా.. కనీస వైద్యం కూడా కరువైంది. వేలాది మంది ప్రాణాలు విడిచారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది. శవాల మీద కాసుల ఏరుకునే పనిని చేపట్టి కోట్లకు పడగలెత్తాయి ప్రైవేటు ఆస్పత్రులు. సర్కారు వైద్యాన్ని నమ్మి ప్రాణాలు పోగోట్టుకున్నారు పేద ప్రజలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా తాటికొండ రాజయ్యకు అవకాశం ఇచ్చాడు కేసీఆర్. రాజయ్య ఓవర్ యాక్షన్ కారణంగా దాన్ని కాపాడుకోలేకపోయాడు.
ఆ తర్వాత చర్లకోలా లక్ష్మారెడ్డికి ఇచ్చారు ఆరోగ్య మంత్రిగా. ఆయన అసలు డాక్టరే కాదు.. మున్నాబాయి ఎంబీబీఎస్ అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. మంత్రిగా ఆయన కూడా ఈ శాఖకు చేసిందేమీ లేదు. ఏ ఆదేశం ఇవ్వాలన్నా.. నయా పైసా ఖర్చు పెట్టాలన్నా.. సీఎం సార్ ఓకే అనాలె. ఆయన అనడు. ఈయన ముందడుగు వేయడు. ఇంకేముంటుంది..? ఎక్కడేసిన గొంగళి అక్కడే. అలా కొనసాగుతూ వచ్చాడు కానీ.. ఆ శాఖకు కొత్తగా చేసిందేమీ లేదు. ఆ తర్వాత రెండో సారి అధికారంలోకి వచ్చాకా.. ఈటల రాజేందర్‌కు వచ్చింది ఈ శాఖ. అసలు మంత్రిని చేయాలనే లేకుండే కేసీఆర్‌కు, చివరి నిమషం వరకు కూడా ఈటల పేరు లేదు. ఇక ఈటల పార్టీ వీడుతాడు అనే ప్రచారం జరిగిన తర్వాత కేటీఆర్ కల్పించుకుని ఈటలకు కేబినెట్‌లో బెర్త్ ఖరారు చేయించాడు. తనకు నచ్చని వైద్యారోగ్య శాఖను కేటాయించి కసి తీర్చుకున్నాడు కేసీఆర్.
ఇక ఈటల ఈశాఖకు ఏం చేయగలుగుతాడు. అగో అసోంటి టైమ్‌లోనే వచ్చింది కరోనా ప్రజల ప్రాణాలు తీసేందుకు. వీరిద్దరి మాటలు ఉండవు. కేసీఆర్ ఆ శాఖను పట్టించుకోడు. ఈటల పోయి సీఎంతో మాట్లాడి ఓ దరికి తీసుకురాడు. ఇక్కడ ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అంతలా ఆగం చేసింది ఈ శాఖ. అంతలా అనాథ చేశాడు కేసీఆర్ ఈ శాఖను. ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ శాఖ మరింత ఆగమై పోయింది. సీఎం వద్ద ఉంది అని చెప్పుకుంటున్నా.. ఆయన దగ్గర చాలా శాఖలే ఉన్నాయి. ఏ శాఖ గురించీ ఆయన పట్టించుకున్నది. ఆరోగ్య శాఖకు మరింత సుస్తీ చేసి వెంటిలేటర్‌పై కొన ఊపిరి తీసుకుంటున్నది. ఈటలను ఓడగొట్టేందుకు పెట్టిన కృషి, శ్రమ, సమయం, పట్టుదల, ఇంట్రస్టు.. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పెడితే వేలాది మంది పేద ప్రజల ప్రాణాలు నిలబడేవి. లక్షలాది మంది అప్పుల పాలై రోడ్డు పాలు కాకుండా కాపాడేది. కానీ అలా జరగలేదు. ఈటల ఓడిపోనూ లేదు.
ఇగో మళ్లా అటు తిరిగి ఇటు తిరిగీ… ఓ ఉప ఎన్నిక కోసం ఆడిన అబద్దం ఆడకుండా ఆడి.. ఓడి వచ్చిన హరీశన్నకు ఈ శాఖను అప్పగించాడు కేసీఆర్. మరి ఆ శాఖంటే మన సర్కారుకు అంత పట్టింపు. ఈ ఆర్థిక శాఖ మంత్రి అన్ని లెక్కలు చూసుకుని, ఆదాయం, అప్పులు సరిచూసుకుని.. ఆఖరికి ఆరోగ్య శాఖకు ఏమన్నా నిధులు విదిల్చుతాడా..? అక్కడ అంతా సీన్ లేదు. అంత ఆదాయమూ లేదు.. సీఎంను కాదని ఈయన చేసేది ఇంతకన్నా లేదు..