ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో గెలవడం అంత మామూలు విషయమేమీ కాదు. ఇది ఎవ్వరూ కాదనలేని విషయమే. అధికార పార్టీ ఇంత శ్రమకోర్చినా.. ఈటల బయటపడ్డాడు. కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఉద్యమకారులు కలిసొచ్చారు. దళితబంధు టీఆరెస్ కొంపముంచింది… కారణాలేమైనా కానివ్వండి.. ఈటల గెలుపు ఓ చరిత్ర.
కేసీఆర్‌కు కనువిప్పు. ఓ గుణపాఠం. ఓ గర్వభగం. కానీ హుజురాబాద్‌లో గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ ఏదో ఊహించుకుంటున్నాడు. తనేదో అనుకుంటున్నాడు. వాస్తవంగా ఇది బీజేపీకి దక్కిన గౌరవం కాదు. వ్యక్తిగతంగా, సానుభూతి పరంగా, ప్రభుత్వ వ్యతిరేక పరంగా పడ్డ ఓట్లే. ఈటలపైనా తీవ్ర వ్యతిరేకత ఉన్నది అక్కడ. కానీ, ఈ పరిస్థితులు ఆయనకు అనుకూలించాయి. ఇక తనకు తిరిగేలేదనే విధంగా ప్రవర్తించడం ఈటలకు మొదటి నుంచి అలవాటు. అదే ఆయనకు చేటు తెస్తూ ఉన్నది. దానికి ఆయన పెట్టుకున్న పేరు ఆత్మగౌరవం.
టీఆరెస్‌లో కూడా నేల విడిచి సాము చేశాడు. కేసీఆర్ గురించి అంతా తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో తను వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు చెబుతూ పోయాడు. కేసీఆర్‌కు తిక్కరేగేలా చేశాడు. అది ఈటల స్వయంకృతాపరాధమే. కేసీఆర్‌తో మంచిగా ఉంటే.. ఆయనకు ఆ ప్లేస్ అలాగే ఉండేది కావొచ్చు. కానీ అలా ఉండలేకపోయాడు. కమ్యూనిష్టు భావజాలమో.. వ్యక్తిగత సిద్ధాంతమో.. ఏదో ఒకటి ఆయన్ను తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే కోరుకునేలా చేసింది. అదే ఆయన కొంపముంచింది.
రాజకీయాల్లో రాణించాలంటే అణిగిమణిగి ఉండాలె. అలా ఉంటేనే పదవులొస్తాయి. అవి పది కాలాలపాటు పదిలంగా ఉంటాయి. పదవుల కోసం వెంపర్లాడెటప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాదు. పదవులు పోయిన తర్వాత ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. అదంతే.. మానవ సహజం. సరే, ఇప్పుడు చెప్పేదేమిటంటే.. బీజేపీలో కూడా ఈటల ఇదే విధానంతో ముందుకు పోతున్నాడు. అక్కడ ఏళ్లుగా పాతుకుపోయిన వారున్నారు. కరుడు గట్టిన హిందుత్వ భావంజాలంలో జ్వలించిపోయే వారున్నారు.
పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే వాళ్లున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఏకంగా సీఎంను అవుతాననే ఊకదంపుడు ప్రచారం అక్కడి లాగే ఇక్కడ కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదే. కూర్చున్న కొమ్మను నరుక్కునేదే. ఈటల నిన్న అన్నట్టు ఆట ఇప్పుడే మొదలయ్యింది.. అప్పుడే ఎందుకు తొందర. ముందు ముందు ఆ పార్టీలో నీకు దొరికే ఆత్మగౌరవం టీఆరెస్‌కు మించి ఏముండదు. వ్యక్తిగత స్వేచ్ఛ అంతకన్నా ఉండదు. ఏ పార్టీ అయినా అంతే. ఈటలకు ఇంకా తత్వం బోధపడనట్టుంది.
