హుజురాబాద్ ఉప ఎన్నిక బ‌హుశా దేశంలో అత్యంత ఖ‌రీదైన ఉప ఎన్నిక కావొచ్చు. ఈ ఎన్నిక‌లో గెలిచేందుకు టీఆరెస్ ఏమేమి చేయాలో చేసింది. ఏమేమీ చేయ‌కూడ‌దో కూడా చేసేసింది. హామీలు గుప్పించింది. డ‌బ్బులు కుమ్మ‌రించింది. నిధులు పారించింది. ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. ఓటుకు ఆరువేలు, ప‌దివేలు అని రేట్ పెంచేసింది. మొత్తానికి ఓ ట్రెండ్ సెట్ చేసింది. తెలంగాణ ధ‌నిక రాష్ట్రం అని కేసీఆర్ ప‌దే ప‌దే చెప్ప‌న‌ట్టుగానే ఈ ఎన్నిక‌లో అయిన ఖ‌ర్చును చూస్తే త‌ప్ప‌కుండా ధ‌నిక రాష్ట్ర‌మ‌నే అనిపిస్తుంది ఎవ‌రికైనా. ప‌క్క రాష్ట్రమోడు ఎవ‌డైనా ఈ ఎన్నిక జ‌రుగుతున్న‌తీరు, ఖ‌ర్చులు చూస్తే నోరెళ్ల‌బెడ‌తాడు. ఎక్కడా జ‌ర‌గ‌న‌వి మ‌న ద‌గ్గ‌ర ఇలా అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూ ఉంటాయి. ఇప్పుడు హుజురాబాద్ కూడా అలాగే ఉంది. హ‌రీశ్ రావు కాలుకు బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగాడు. గ్యాస్ సిలిండ‌ర్ ప్ర‌చారాన్నీ వ‌ద‌ల్లేదు. అగ్గిపెట్టె ధ‌ర పెరిగింద‌ని దాన్ని కూడా వాడ‌తారేమో ప్ర‌చారానికి అని అనుకున్నారు. కానీ ఎందుకో దాన్ని వ‌ద‌లేశాడు హ‌రీశ్‌.అగ్గిపెట్టె అంటే ఆయ‌న‌కు అచ్చిరాదేమో.

ఈ ఎన్నిక ఓ కొత్త ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారింది. దీనికి కేసీఆర్ ఆజ్యం పోశాడు. విచ్చ‌ల‌విడి ఖ‌ర్చు పెట్ట‌డం అల‌వాటు చేశారు. ఓట‌ర్ల‌కు రేటు ఆమాంతం పెంచేశాడు. రేపు తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌తీ ఎన్నిక దీన్నే న‌మూనాగా తీసుకుంటే.. పోటీ చేసేటోడు బ‌లిప‌శువే అవుతాడు.

మెడిక‌ల్ కాలేజీ నుంచి మొద‌లు పెట్టి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, రోడ్లు, సంఘ భ‌వ‌నాలు, స్థ‌లాలు, కొత్త పించ‌న్లు, ద‌ళిత బంధు.. ఇంకా ఏమోమో హామీలున్నాయి. ఒక‌వేళ ఓడిపోతే.. జీహెచ్ఎంసీలో వ‌ర‌ద సాయంలా ఇవీ ఆగిపోతాయా..? ఎందుకాగుతాయి. ఓడినా అమ‌లు చేస్తారు. ఎందుకంటే ప్ర‌భుత్వం వాళ్ల‌దే క‌దా. మ‌ళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తారు .. అంటారా? అవ‌న్నీ రాజ‌కీయాల్లో కామ‌న్‌బై . నువ్వు మ‌రీ ఎక్కువ ప‌ట్టించుకుని ధిమాక్ ఖ‌రాబ్ చేసుకోకు.