రాత్రి 9 గంటలవుతున్నది. రాజారెడ్డి ఇంకా ఇంటికి రాలేదు. గుమ్మం దగ్గర కూర్చుని అతని రాకకోసం ఎదురుచూస్తున్నది వనజ.
ఆమె మనసంతా ఆందోళనగా ఉంది. ఆలోచనలు పరిపరివిధాల సాగుతున్నాయి. క్షణక్షణం గుండె దడ పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది.
ఫోన్ కేసి చూస్తున్నది మాటిమాటికి. అది ఎప్పుడూ లేని విధంగా మౌన వ్రతం పాటిస్తున్నది. దాని మౌనాన్ని భరించలేకుండా ఉన్నది వనజ.
చీకట్లు చిక్కగా అలుముకుంటున్నాయి. “అమ్మా….! రా తిందాం” పెద్దది పిలుస్తున్నది. “నాకు ఆకలిగా లేదు. మీరు తినండి.” శూన్యంలోకి చూస్తూ చెప్పింది వనజ. ఉన్నట్లుండి చల్లటి గాలులు వీస్తున్నాయి. వర్ష సూచనలాగా అనిపించింది ఆ వాతావరణాన్ని చూస్తే ఆమెకు. ఆ ఆలోచన మరింత ఆందోళన పెంచింది. “ఎలా….? రాజారెడ్డి ఎటుపోయాడు?? రవికి ఫోన్ చేస్తే?? ” ఆమెలో ఆలోచనలు సుడులు రేపుతుండగానే…. వనజ ఫోన్ రింగయ్యింది. లక్ష్మి ఫోన్ చేస్తున్నది. ఒక్కసారిగా కొత్త ఊపిరి వచ్చినట్లుగా నిట్టూర్చింది వనజ. ముఖంలో మరింత ఆత్రుత పెరిగింది. రెండు రింగులు కూడా పూర్తి కానివ్వలేదు. వెంటనే లిఫ్ట్ చేసింది. అవతల నుంచి లక్ష్మి గొంతు ఆందోళనగా వినిపించింది. “అన్న రాలేదా?” ఆత్రుత నిండిన స్వరంతో అడిగిందామె. ఇంకా రాలేదు. అన్నది వనజ. ఆమె అలా అడిగే సరికి మరింత ఆందోళన పెరిగిందామెలో. ” ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మను.” “అర్జెంటుగా” అని ఫోన్ పెట్టేసిందామె.
లక్ష్మి ఏం చెప్పాలనుకుందో తెలియదు. ఆమె మాటలు మరింత గందరగోళానికి గురి చేశాయి. ఆందోళనను రెట్టింపు చేశాయి.
మళ్లీ ఫోన్ కలిపింది లక్ష్మికి. “అవుటాఫ్ కవరేజ్ ఏరియా…….”
*****
ఫోన్ మాట్లాడి వచ్చి రాజారెడ్డి ఎదురుగా కూర్చున్నాడు రవి నాయక్. డిస్పోజబుల్ గ్లాసుల్లో మందు కలిపాడు. ఇద్దరు చీర్స్ కొట్టారు. ఇద్దరు కలిసి సిట్టింగ్ వేయడం ఇదే తొలిసారి.
చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఒకటే గుక్కలో మొదటి పెగ్ ఖాళీ చేసేశాడు. ఎటో చూస్తున్నాడు రాజారెడ్డి.
రాజారెడ్డి వాలకం భయం గొల్పుతున్నది రవికి. రెండో పెగ్గు రెడీ చేశాడు. ఏమీ మాట్లాడకుండా దాన్ని గుటుక్కున మింగేశాడు.
విషం కక్కేందుకు రెడీగా ఉన్న తాచుపాములా బుసలు కొడుతున్నాడు రాజారెడ్డి.
గరళం నింపుకుంటున్నట్లు కడుపులో ధైర్యం కోసం మందును గటగటా మింగేస్తున్నాడు. కళ్లు మరింత ఎర్రగా మారాయి అతనివి.
ఆ చీకట్లో కూడా అవి చింతనిప్పుల్లా రాజుకుంటున్నాయి. ఆ కళ్లను పసిగట్టాడు రవి.
“ రెడ్డీ సాబ్ ఏందీ ..? ఈ రోజు మస్తు పరేషాన్ గా ఉన్నావ్??” ఏదో అడగాలే కాబట్టి అడిగాడు. వాస్తవానికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు అతనికి. ఏం మాట్లాడితే ఏం అంటాడో అనే భయం వెంటాడుతున్నది.
ఏం మాట్లాడలేదు రాజారెడ్డి. భార్య నుంచి ఫోన్ వస్తున్నది. దాన్ని సైలెంట్ మోడ్ లో పెట్టాడు. అది గమనించాడు రవి. ఒకటో పెగ్గు కంప్లీట్ చేశాడు రవి నాయక్. రాజారెడ్డికి మూడో పెగ్గు నింపాడు.
దాన్ని క్షణంలో గొంతులోకి ఒంపేశాడు మళ్లీ. కడపులో ఏమీ లేదు. పేగుల్లో యాసిడ్ ప్రవహిస్తుందా అన్నంత మంట పుడుతున్నది అతనికి. అది పేగులను కరకర కాల్చేసి బూడిద చేసేస్తున్న ఫీలింగ్ కలుగుతున్నదతనికి. భగభగ మండే గుండె మంట ముందు ఆ కడుపు మంట పెద్దగా బాధించలేదు.
చీకట్లు మరింత దట్టంగా అలుముకున్నాయి. ఫోన్ లో టార్చ్ ఆన్ చేశాడు రవి నాయక్. గ్లాసులో మందు పోసేందుకు లైట్ వాటి మీద ఫోకస్ చేశాడు.
ఆ వెలుతురు రాజారెడ్డి పక్కనే ఉన్న కత్తి పిడి మీద పడింది. వెండి పిడి కావడంతో అది ఒక్కసారిగా జిగేల్ మని మెరిసింది.
“ఏంటది??”
ఆ మాటలు పూర్తికాకముందే… విల్లు నుంచి వదిలిన బాణంలా వేగంగా కదిలాడు రాజారెడ్డి. కత్తి పిడిని అలాగే ఎడమ చేత్తోనే పట్టుకొని కొద్దిగా వంగి మెడ భాగంలో కసిగా, లోతుగా ఓ గాటు వేశాడు. చిలుము పట్టి ఉన్న ఆ కత్తి మెడభాగంలోని నరాన్ని ‘ఫట్’ మని తెంపేసింది. మేకను కోస్తే రక్తం చిమ్మినట్లు చివ్వున చిమ్మింది రక్తం.
ఫౌంటేన్ నుంచి ఎగజిమ్మే నీటి ధారలా అది వచ్చి రాజారెడ్డి ముఖం మీద గుమ్మరించినట్లు చిమ్మంది. వెచ్చగా తడిసింది రాజారెడ్డి ముఖం. ముఖం సగభాగం, ఛాతి పై రక్తం ధారాలై పారుతున్నది.
మెడను రెండు చేతుల్తో పట్టుకొని అలాగే కింద పడి కొట్టుకుంటున్నాడు రవి నాయక్.
“అమ్మా … అమ్మా…..” అంటున్నాడు. కానీ ఆ ఆర్తనాధాలు గొంతులోంచి పెకిలి బయటకు రావడం లేదు. తన గొంతును తానే నులిమేసుకుంటున్నట్లుగా “గు .. గుర్రే.. ” మని శబ్దం వస్తున్నది. ఈ
రక్తం ధారలై పారుతున్న రాజారెడ్డి ముఖం ఆ చిమ్మ చీకట్లోనూ భయంకరంగా కనిపించసాగింది రవికి. అతని రాక్షసరూపం చూసి గుండె చచ్చుబడిపోయిందా…? అన్నట్లుగా భీతిల్లాడు అతను.
అసలు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడో కూడా రవికి తెలియలేదు. ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేందో కూడా అంతుచిక్కలేదు.
ఇపుడాలోచించే టైమూ లేదు. ప్రాణాలు గాలిలో కలిసిపోయేందుకు ఎంతో సమయం లేదని మాత్రం తెలిసిపోతున్నది.
రక్తం చిమ్మడం ఆగుతున్నది. దారలుగా పారుతున్నది. రవి పడిన చోట కింద మొత్తం చిత్తడిగా ఉంది రక్తంతో.
పులి పంజాకు దెబ్బతిన్న లేడిపిల్లలా గిలగిలా తన్నుకుంటున్నాడు. గొంతు పై చేతులు మాత్రం తీయడం లేదు. వేళ్ల సందుల్లోంచి రక్తం చిక్కగా ఉబికి ఉబికి వస్తున్నది.
క్షణకాలం అలా మనసారా అతన్ని చూశాడు రాజారెడ్డి. లేవకుండా ఒక్కవేటుకు కిందపడిపోయిన అతన్ని చూసి ముఖం విప్పారింది.
కానీ ఇంకా కసి తీరలేదు. ఒక్క ఉదుటన లేచాడు. కత్తి పిడిని బలంగా పిడికిలితో బిగించాడు. గుండెపై ఒక్కపోటు పొడిచాడు. అర అడుగు మందం గుండెలోకి దిగిందది. గొంతును పట్టుకున్న చేతులు వదిలేశాడు రవి. – “అమ్మా …”అన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు.
కానీ అది ఎక్కడో అగాథం నుంచి వచ్చినట్లుగా ఆ చీకట్లోనే కలసిపోయింది. ఆమడదూరం కూడా ఆ ఆర్తనాథం వెళ్లలేదు. గుండెలో దిగిన కత్తిని పట్టుకోబోయాడు రవి. అంతలోనే దాన్ని పెకిలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు రాజారెడ్డి. అది రావడం లేదు. బిగుతుగా దిగిపోయిందది. బలవంతంగా పైకి లాగాడు. పైకి ఎత్తి బలాన్నంత ఉపయోగించి ఈసారి కడుపులో దింపాడు. పిడి ఒక్కటే మిగిలింది. కత్తి ఆసాంతం లోపలికి దిగబడింది. నేల పై నుంచి తలను ఒక్కసారిగా పైకి ఎత్తి మళ్లీ నేలకు గుద్దుకున్నాడు రవి. అలా మూడు సార్లు చేశాడు. ప్రాణం పోయింది. శరీరం అచేతనంగా పడిపోయింది.
లేచి నిలబడ్డాడు రాజారెడ్డి. కసితీరా ఆ చలనం లేని శరీరాన్ని చూశాడు. కాళ్లను ఒక్క తన్ను తన్నాడు. అవి మొద్దుబారినట్లు కదల్లేదు. తల దగ్గరకు పోయి మరో తన్ను తన్నాడు. మెడ అటు తిరిగింది.
“ రేయ్ … రవి.” గట్టిగా అరుస్తున్నాడు.
“చచ్చావురా …నా చేతిలో… చంపేశాను నిన్ను.” పిచ్చిపట్టిన వాడిలా ఆకాశానికేసి చూస్తూ మాట్లాడుతున్నాడు. “హ.. హ..హ.. చావురా.. నా కొడకా అని కాలితో కడుపులో ఉన్న పిడిని తన్నాడు. అది మరింత లోపలకి వెళ్లింది. వికట్టహాసం చేశాడు ఆనందంతో. ఆ దారుణాన్ని చూడలేననట్లుగా వర్షం ప్రారంభమైంది. పటపట మని పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. క్షణాల్లోనే వర్షం పెద్దదైంది.

( ఇంకా ఉంది)

You missed