లీడర్‌గా ఎదిగాలంటే ఓపికుండాలి. సహనం కావాలి. సమస్యలు విని పరిష్కరించే చొరవ ఉండాలి. ఆవేశంగా ప్రజల కోసం పోరాడే గుణముండాలి. ఆలోచనతో ముందుకు సాగే సమయస్పూర్తి కావాలి. ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ పోవాలి. అలా అన్ని విషయాపై స్పష్టమైన అవగాహన ఉన్ననాడే పరిపక్వత చెందిన నాయకుడవుతాడు. కేటీఆర్ ఇప్పుడు అదే బాటలో సాగుతున్నాడు.
మొన్నటికి మొన్న అసెంబ్లీలో..మున్సిపల్ అధికారుల తప్పదం వల్లే రజినీకాంత్ అనే వ్యక్తి మరణించాడని, దీనికి నాదీ పూర్తి బాధ్యత అని ఒప్పుకున్నాడు. ఇలాంటివి జరగకుండా కూడా చూస్తానన్నాడు. ఇలా ఆయన స్పందించినప్పుడు ఆయనలో పరిపక్వత కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రెస్‌మీట్లలో ఆయన స్పందిచన తీరు మరీ ఆవేశపడి పోయి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మంత్రి మల్లారెడ్డి .. రేవంత్‌రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన సందర్భాన్ని పొగిడినప్పుడు అంతా కేటీఆర్‌ను విస్తుపోయి చూశారు.
మంత్రి మల్లారెడ్డి అంటేనే జనాలకు ఓ రకమైన వ్యతిరేక భావన ఉంది. ఆయనకు మంత్రి పదవేందీ? అని సొంత పార్టీలోనే పెదవి విరిచినవారున్నారు. సబ్జెక్టు లేక.. మాట్లాడే విషయంపై అవగాహన లేక ఏదో మాట్లాడి నవ్వులపాలవుతూ ఉంటాడు. అలాంటి మల్లారెడ్డి అంటే మన కేటీఆర్‌కు అలవిమాలిన అభిమానం. ఎందుకో..? ఈట్‌కా జవాబ్ పత్తర్ సే .. అంటూ పార్టీ శ్రేణులను కూడా రెచ్చగొట్టేలా మాట్లాడటం ఆయనలో ఆవేశం పాలును పట్టిచ్చింది.
హరీశ్‌రావు ను ఇలాంటి విషయాల్లో చాలా సంయమనం పాటిస్తాడు. ఎక్కడా ఆవేశానికి లోనుకాడు. సందర్భాన్ని బట్టి స్పందిస్తాడు. అసందర్బమైతే హుందాగా తప్పుకుంటాడు. ఇప్పుడు హుజురాబాద్‌లో గెలుపు కోసం ఏదేదో మాట్లాడుతున్నాడు.. అదే వేరే విషయం. వదిలేయండి. కానీ రాజకీయంగా ఓ నాయకుడు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ముందుకు సాగేక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు.. ఇవన్నీ సరిగ్గా అంచనా వేసి వాటిని ఎదుర్కొంటూ తప్పించుకుంటూ.. మీద పడిన ఇటుకలను తన భవిష్యత్ నిర్మాణానికి వాడుకుంటూ ముందుకు సాగినప్పుడే కదా పర్‌ఫెక్ట్ లీడర్ అయ్యేది. మన కేటీఆర్ ఇంకా ఇలాంటివి నేర్చుకోవాల్సి ఉంది.