హుజురాబాద్ ఉప ఎన్నిక. ఇప్పుడు రాష్ట్రమే కాదు..దేశమే దీని వైపు ఆసక్తిగా చూస్తున్నదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా దీనికి హైప్ క్రియేట్ చేశారు. ఎవరంటారా? ఇంకెవరు. మన కేసీఆర్. ఆయన ఆది నుంచి ఈ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈటలపై గెలుపును అంత ఆషామాషీగా తీసుకోలేదాయన. మామూలుగా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది కేసీఆర్ పాలసీ. కానీ ఇక్కడ ఈటల రాజేందర్‌ను చిన్న పాముగా కూడా ఆయన చూడలేదు. ఆయన దృష్టిలో ఈటల ఆనకొండ. మరి చిన్నపామునే కొట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే కేసీఆర్.. ఈటలను చంపేందుకు.. అదే కొట్టేందుకు ఎంతటి శక్తియుక్తులు ప్రయోగించాలి. ఎంతలా శ్రమకోర్చాలి..? ఎంతలా ఖర్చలు పెట్టాలి..? అదే చేస్తున్నాడు. ఇలా ఆలోచించే ఆయన తప్పులో కాలేశాడు. అవును .. ఇప్పుడంతా అదే అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ ను అలా వదిలేస్తే సరిపోయేది. అన్ని ఎన్నికల్లాగే దీనిపైనా అలా ఓ నజర్ పెడితే సరిపోయేది. కానీ కేసీఆర్ దీన్ని ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్నాడు. అల్లుడు హరీశ్‌రావును రంగంలోకి దింపాడు. ఎలాగైనా సరే, ఎన్ని అబద్దాలు చెప్పైనా సరే గెలిచి రావాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు హరీశ్ అక్కడ అవే తిప్పలు పడుతున్నాడు.
ఎక్కడా లేని, ఎన్నడూ లేని విధంగా ఓ ఉప ఎన్నికకు ఇంతలా ప్రాధాన్యతనివ్వడం మూలంగా కేసీఆర్ తనకు తాను సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా? పులి మీద స్వారీ చేస్తూ.. పార్టీ భవిష్యత్తును ఈ ఎన్నికకు లింకు చేస్తున్నాడా? దీన్నే రాష్ట్ర ప్రజలు రెఫరెండంగా భావించనున్నారా? ఇప్పుడంతటా ఇదే చర్చ జరుగతున్నది. ఒక వేళ టీఆరెస్ గెలిస్తే.. అబ్బ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి.. అదో గెలవడమా? అంటారు. మరి ఖర్మకాలి ఓడిపోతే.. ఒడిసిందిరా టీఆరెస్ పని అని ఢంగా బజాయిస్తారు. బొటాబొటీగా మెజార్టీ వచ్చినా.. దాన్ని గెలుపు కింద జమ కట్టే పరిస్థితి లేదు. ఇలాంటి సిట్యూవేషన్ ను క్రియేట్ చేసింది ఎవరు? కేసీఆరే. దళితబంధు అన్నాడు. పడకేసిన పథకాలన్నీ పరుగులు పెట్టించాడు. హామీలిచ్చి మరిచిపోయిన వాటిని ఇక్కడే గుర్తు తెచ్చుకున్నాడు. అమలు చేస్తానని మాటైతే ఇచ్చాడు. ఉద్యోగాలిస్తానన్నాడు. రోడ్లు బాగవుతున్నాయి. డబుల్ బెడ్ రూంలకు చలనం వచ్చింది. ఆగిన అభివృద్ది పనుల్లో కదలిక వచ్చింది. కొన్ని ఇక్కడికే పరిమితమైతే మరికొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన పరిస్థితులు కొనితెచ్చుకున్నాడు.
మొత్తానికి పులమీద స్వారీ చేస్తున్నాడు కేసీఆర్. ఎహె.. ఇదేమీ కొత్తనా కేసీఆర్‌కు. ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఈటల రాజేందర్ ఓ బచ్చా.. ఎలా ఓడగొట్టాలో.. మట్టి కరిపించి కనుమరుగు చేయడమెలాగో ఆయనకు బాగా తెలుసు.. మీరెక్కువగా ఊహించుకోకండి.. అని అంటారా? ఏమో గతంలో వేరు.. ఇప్పుడు జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికైతే మరీ వేరు.పెద్దాయనెందుకో భయపడుతున్నాడు? ఎందుకు అంతలా భయపడాల్సి వచ్చిందో తెలియదు? ఈటల ను గెలిస్తే.. చావుదెబ్బ కొడితే.. ఇంకా ఎవరూ నోరు మెదపరనా? తనతో పెట్టుకుంటే ఎలా కొట్టుకుపోతారో చూశారా? అని ఈగో సంతృప్తి పడేలా ఎలుగెత్తి చాటాలనుకున్నాడా? సరే, ఏదో చేయాలనుకున్నాడో? దాని కోసం ఏదేదో తంటాల పడుతున్నాడు. అందరి ముందు చులకనవుతున్నాడు. అదే ఇక్కడ పిటీ.