న్యూఢిల్లీ : సాంప్రదాయ వైద్యమైన ఎర్రచీమల పచ్చడిని దేశమంతా అమలుచేసేందుకు అనుమతివ్వాలంటూ… ఒడిశాకు చెందిన గిరిజనుడు వేసిన దావాను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

కరోనా నివారణకు సాంప్రదాయ వైద్యమైన ఎర్ర చీమల పచ్చడిని ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని గురువారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ”చాలా రకాల సంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. మన ఇంట్లోనూ కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. దేశమంతటా దీన్ని అమలు చేయాలని అడగకూడదు” అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్‌ పఢియాల్‌.. ఈ దావాను మొదట ఒడిశా హైకోర్టులో వేశారు. ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని, కరోనా నివారణకు దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరాడు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు దీన్ని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని తెలిపారు.

దీనిపై పరిశీలన జరపాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్‌ఐఆర్‌), ఆయుష్‌ మంత్రిత్వ శాఖలను ఒడిశా హైకోర్టు ఆదేశించింది. అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దావాను కొట్టివేసింది.

దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కరోనా నివారణకు ఎర్ర చీమల పచ్చడిని సిఫార్సు చేయలేం అంటూ.. సుప్రీం కోర్టు ఆ దావాను కొట్టివేసింది.

ప్రజాశక్తి దినపత్రిక,10 సెప్టెంబర్ 2021
(Copied From:
Sambasivarao Mutyala garu..)
— Rajeshwer Chelimela , Jvv Telangana

You missed