కేసీఆర్ ఓ రాజకీయ నాయకుడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అప్పటి వరకు లేదు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్యయనం చేసినవాడు. తెలంగాణ ఆత్మగౌరవ అవసరాన్ని కాలక్రమేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్యమనేతగా చూస్తారు. కానీ కేసీఆర్ మొదట ఓ రాజకీయ నాయకుడు. ఆ తర్వాత ఉద్యమ నాయకుడు. ఆ తర్వాత సీఎం. రాజకీయ నాయకుడిగా తనకున్న అనుభవంతో పార్టీ స్థాపన నాటి నుంచి నేటి వరకు ఎక్కడా జెండా కింద పడకుండా నిలుపగలిగాడు.
ఎక్కడా గెలవాలో, ఎక్కడా ఒదగాలో తెలిసిన వాడు. తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్ణాలను తనవైపు తిప్పుకున్నాడు. పార్టీకి అదే జీవం పోసింది. కాపాడింది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి టీఆరెస్ జెండా కిందకి తీసుకువచ్చి పోరాటం నిర్మాణం చేయడంలో వ్యూహాలు సక్సెస్ ఫుల్‌గా చేయగలిగాడు. ఉద్యమ పాఠాలు నేర్చుకుంటునే రాజకీయ పార్టీగా టీఆరెస్‌ను బలోపేతం చేసే క్రమంలో ఎప్పటి కప్పుడు తనకు తాను పరీక్షలు పెట్టుకుంటూ వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా వాటి అనుభవాలుగా, గుణపాఠాలుగా స్వీకరిస్తూ ముందుకు సాగాడు. ఓ వైపు ఉద్యమ నాయకుడిగా సక్సెస్ అవుతూనే అందరి నమ్మకాన్ని చూరగొని కలిసికట్టుగా ముందుకు సాగుతూనే అంతర్లీనంగా పార్టీ బలోపేతం పై కూడా ఆయన దృష్టి సారిస్తూ వచ్చాడు. ఎన్నో పార్టీలు వచ్చాయి. కాల క్రమంలో అవన్నీ కాలగర్భంలో కలిచాయి.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎన్టీ రామారావు టీడీపీని ఏర్పాటు చేసి అప్రతిహతంగా పార్టీని విస్తరిస్తూ పోయిన తీరు కేసీఆర్‌కు ఆదర్శం. అక్కడా ఆత్మగౌరవ నినాదమే.. ఇక్కడా ఆత్మగౌరవ నినాదమే. కానీ పంథా ఒక్కటే. ఆలోచన ఒకటే.. గమ్యం ఒకటే. పార్టీని కాపాడుకునే క్రమంలో కేసీఆర్ చాలా మందిని దూరం చేసుకున్నాడు. అప్పటి వరకు భుజానికెత్తున్న వారినే తీసి బండకు కొట్టాడు.
కేసీఆర్ ఎప్పుడు ఎవరిని దగ్గరికి తీస్తాడో.. ఎప్పుడు వారిని దూరం పెడతాడో తెలియదు. ఎంతో మంది ఉద్యమకారులు ఇప్పుడు ఆయన చెంత లేరు. ఉద్యమ ద్రోహులుగా ముద్రపడ్డవారు చంకనెక్కారు. పదవులు అనుభవిస్తున్నారు. ఇలా ఎందుకు కేసీఆర్ చేస్తున్నాడు? చాలా మందికి జీర్ణం కాని ప్రశ్న ఇదే, సమాధానం దొరకని సవాలిదే. కానీ కేసీఆర్‌కు తెలుసు తను తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీ మనుగడకోసమే. పార్టీ మనుగడ అంటే తెలంగాణకు రక్ష. అనే భావన కేసీఆర్‌ది. అందుకే ఎందరినైనా ఆకాశానికెత్తుతాడు. ఆ వెనువెంటనే పాతాళంలోకి తొక్కేయడానికీ వెనుకాడడు.
రాజకీయమంటే ఇలా ఉంటుందని ఒక నిర్వచనం ఇవ్వగలిగాడు కేసీఆర్. రాజకీయ నాయకుడంటే నాలా ఉండాలనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు. ఇలా లేకనే ఓ చిరంజీవి, ఒక దేవేందర్ గౌడ్, విజయశాంతి, ఆలె నరేంద్ర.. ఎంతో మంది ఇలా వచ్చారు… అలా విలీనమయ్యారు. కేసీఆర్ ఒక్కడే నిలిచి గెలిచాడు. ఆ నిలిచే క్రమంలో ఎందరో బలిపశువులయ్యారు. ఆ గెలిచే క్రమంలో ఎంతో మంది రాజకీయ జీవితాలు బలిపీఠమెక్కాయి. ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అని నిరూపించాడు కేసీఆర్. ఇలా ఉంటనే మనగలుగుతామని ఉదాహరణగా నిలిచాడు.
