కీలకమైన ఆరోగ్యశాఖ తెలంగాణలో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య, వైద్యం ఎంత ముఖ్యమో ఈ రెండు శాఖలు తెలంగాణలో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్యశాఖ గురించి కాదు ఈ కథనం. వైద్యం గురించి. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యశాఖ మంత్రిగా రాజయ్య చేసింది తక్కువ.. బిల్టప్ ఎక్కువగా ఉండే. దీంతో చిర్రెత్తుకొచ్చి కేసీఆర్ పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత వైద్య మంత్రిగా చర్లకోల లక్ష్మారెడ్డికి అవకాశం దక్కింది. కానీ ఆది నుంచి ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం వివాదస్పదమే అయ్యి కూర్చుంది. డాక్టర్ చదవని లక్ష్మారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారంటూ మున్నాభాయ్ ఎంబీబీఎస్ అని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. దీన్ని నిరూపించుకునేందుకు లక్ష్మారెడ్డి అపసోపాలు పడ్డాడు. ఆ తర్వాత ఈ శాఖ పై మంత్రి తన కంటే అధికారులనే ఎక్కువ నమ్ముకున్నాడు. వాళ్లే ఆయనను నడిపించారు.
ఇక తెలంగాణ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశాఖ పూర్తిగా ఆగమైపోయింది. కేసీఆర్ దీన్ని ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖగా ట్రీట్ చేయడం జనాల ప్రాణాల మీదకు తెచ్చింది. వైద్య మంత్రిగా ఈటలకు అప్పగించాడు. అసలు ఈటలకు మంత్రి పదవి ఇవ్వాలనే కేసీఆర్ అనుకోలేదు. చివరి నిమిషంలో కేటీఆర్ బలవంతం మీద ఈ పదవి ఈటలకు దక్కింది. ఆనాటి నుంచి వైద్యశాఖ మంత్రుండి లేని అనాథగానే ఉంది. ఖర్మకాలి ఈ సమయంలోనే కరోనా కాటేసింది. ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి.
అయినా పట్టించుకునే దిక్కులేదు. ఆరోగ్యమంత్రికి, సీఎంకు సమన్వయం లేదు. మధ్యలో కరోనా మరణమృదంగం మోగించింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్య శాఖ.. ఈటల పై కసి తీర్చుకునే క్రమంలో మరింత చిక్కి శల్యమైపోయింది. ఇక అప్పటి నుంచి ఆరోగ్యశాఖ అనాథ అయిపోయింది. ఇది ఎవరు చూస్తున్నారో.. అజామాయిషీ ఎవరి ఉందో తెలియదు. అంత అధికారుల ఇష్టారాజ్యం. మధ్యలో చచ్చేది జనాలు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో అక్కాచెళ్లల పై జరిగిన గ్యాంగ్‌రేప్ ఆస్పత్రుల్లో అజామాయిషీ లేని తనాన్ని పట్టిస్తుంది. విచ్చలవిడి తనానికి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నా పట్టింపు లేదు. వచ్చే వారికి రక్షణ లేదు. ఆశ్రయించేదంతా పేదలే కావడంతో వారి వేదన అరణ్యరోదనగానే మిగులుతున్నది.
రాజకీయ అవసరాల కోసం అనవసర విషయాలకు ప్రాధాన్యతనిచ్చి, అత్యవసరమైన ఆరోగ్యశాఖను విస్మరించింది ప్రభుత్వం.