ఇందూరు జిల్లా… అందులో నిజామాబాద్ టౌన్…. మున్నూరుకాపుల అడ్డా. ఇక్కడా వీరి జనభా అధికం. రాజకీయంగా పలుకుబడీ అంతే. పరపతీ పెద్దదే. ఏ పార్టీ ఇక్కడ నుంచి గెలవాలన్నా మున్నూరుకాపుల బలం, మద్దతు అవసరం. అంతలా రాజకీయంగా వారి ప్రభావం ఇక్కడ కనబడుతుంది. నిజామాబాద్ అర్బన్‌తో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మున్నూరుకాపు కులస్తులుంటారు. ఈ రెండు నియోజవర్గాలే కాదు.. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా గెలుపోటముల ప్రభావం చూపే సత్తా ఈ కులానికుంది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. మున్నూరుకాపు కులం నుంచి…. అదీ నిజామాబాద్ నుంచి రాజకీయంగా ఎదిగిన వారిలో డీఎస్ అగ్రగణ్యుడు. అతనికి కులమే బలం. నిజామాబాద్ టౌన్‌లో అతని చెప్పిందే వేదం ఒకప్పుడు. కుల సంఘాల పెద్దలంతా డీఎస్‌కు అంతటి మర్యాద ఇచ్చేవారు. ఎన్నికల్లో కూడా డీఎస్ ఎవరికి చెబితే వారికే అన్నట్టుగా ఆ కులస్తులు వ్యవహరించేవారు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. డీఎస్ కాలక్రమేణా రాజకీయంగా తన ఉనికి కోల్పోతూ వస్తున్నాడు. ఇప్పుడతని ఆరోగ్యం సహకరించడం లేదు. టీఆరెస్ నుంచి దూరమై.. ఏ పార్టీలో చేరాలో తెలియక.. సందిగ్దంలో.. అనారోగ్యంతో అలా నాలుగ్గోడలకే పరిమతమయ్యాడు. అతని పెద్ద కొడుకు సంజయ్ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపకపోగా.. చిన్నకొడుకు అర్వింద్ బీజేపీ నుంచి అనూహ్యంగా కవితపై ఎంపీగా గెలిచాడు.
ఇందూరు బీజేపీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. కానీ మున్నూరుకాపులంతా అతని వైపు లేరు. ఎందుకంటే… అర్వింద్ వైఖరి… ఒంటెత్తు పోకడనే. ఈ క్రమంలో మున్నూరుకాపులంతా తమకు సరైన రాజకీయ వేదిక ఏదీ అని అన్వేషిస్తున్న సమయంలో అర్బన్‌లో వారికి ఆకుల లలిత కనిపించింది. నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌కు మున్నూరు కాపుల అండ, బలం ఉండనే ఉంది. కానీ నిజామాబాద్ అర్బన్‌లోనే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బీజేపీ వైపు ఉందామంటే అర్వింద్‌తో పొసగడం లేదు. పెద్దలకు అతనిచ్చే గౌరవం అలాంటింది. దీంతో అంతా ఇప్పుడు టీఆరెస్ వైపు చూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేటషన్ చైర్మన్ ఆకుల లలితకు రాష్ట్ర మున్నూరుకాపు మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పుడామె నిజామాబాద్ మీద దృష్టి సారించింది. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై. రాజకీయంగా డీఎస్ వర్గాన్ని మొత్తం తనవైపు ..అంటే టీఆరెస్ వైపు మరల్చే ఉద్దేశ్యంతో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె మొదలు అడుగు వేసింది. ఈనెల 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌లో వనభోజనాలను ఏర్పాటు చేశారు.
అత్యంత శేష్టమైన కార్తీక మాసం ప్రారంభమైనవేల మొట్ట మొదటిసారిగా ఆకుల లలిత రాఘవేందర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహిళ విభాగం గౌరవ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో నిజమాబాద్ పరిధిలో అంగరంగ వైభవంగా జరుగనున్న వనభోజనాల మహోత్సవానికి మున్నూరుకాపు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక పండగ లా జరుపుకోవాలని కోరుతున్నాం….. అంటూ ఆమె ఇవాళ ఓ ప్రకటనలో ఆమె కోరారు.
మున్నూరుకాపుల పురోగాభివృద్ధి జరుగాలంటే అందరం కలిసి మెలసి ఐక్యంగా ఉండి మున్నూరుకాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న ధ్యేయంతో అందరం ఒక్కతాటి కిందకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది…… అంటూ ఆమె కులబాంధవులకు పిలుపునిచ్చారు. ఈ వనభోజన కార్యక్రమాన్ని ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది.