అంతాఆ మునుగోడు రిజల్ట్ కోసం చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం నాటికి ఏది గెలుస్తుందో దాదాపుగా ట్రెండ్ తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆరెస్ గెలుపే అని చెబుతున్నాయి. పెద్ద మెజారిటీ రాకున్నా టీఆరెస్సే గెలిచి తీరుతుంది. భారీ మెజారిటీ సాధిద్దామని టీఆరెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ దిశగా అది పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇక బీజేపీ నువ్వా నేనా అనే విధంగా టీఆరెస్‌కు ఫైట్ ఇచ్చింది. ఓ దశలో టీఆరెస్ గెలుస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఆ లెవల్లో పోటీ నెలకొన్నది. పైసల ప్రభావం బీజేపీపై బాగా పడింది. బాగా అంచనాలు పెంచారు. ఆఖరుకు అవి అందలేదు. అదీ ఎఫెక్టే. హుజురాబాద్ తర్వాత మునుగోడు ఉప ఎన్నికను మరింత కాస్ట్లీ చేసి వదిలారు నేతలు. అయితే ఇప్పుడు రెండో స్థానం ఎవరిది..? అనే చర్చ జరుగుతున్నది.
దాదాపు టీఆరెస్ విజయం ఫైనల్ అయ్యింది. మరి రెండో స్థానం బీజేపీ ఉంటుందా..? కాంగ్రెస్ ఉంటుందా..? అనే చర్చ విషయంలో మెజారిటీ రెండో స్థానం బీజేపీకే ఇస్తున్నారు. టీఆరెస్ గెలిచింది కదా అని… బీజేపీ, కాంగ్రెస్ బలాబలాలను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు.ఆ లెక్కన కాంగ్రెస్‌ను మరీ కరివెపాకు పార్టీగా భావిస్తే పొరపాటే. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. క్యాండేట్ సెలక్షన్ కరెక్టుగా లేదు. ఆ విషయం కాంగ్రెస్ శ్రేణులే ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. డబ్బు ప్రభావం ఎక్కువగా లేదు. బీజేపీ నాలుగు వేలిస్తే, టీఆరెస్ ఐదారు వేలు… కాంగ్రెస్ ఐదు వందలు, వెయ్యితో సరిపెట్టింది. అయినా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంది.
దాదాపు పాల్వాయి స్రవంతికి 30వేల పై చిలుకు ఓట్లు రావొచ్చు. రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రచారం అంతంత మాత్రంగానే సాగింది. ఇందులో కొందరు టీఆరెస్‌కు వేశారు. ఇంకొందరు బీజేపీకి వేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా కాంగ్రెస్‌కు ఆటంకంగా మారింది. పెద్ద నేతలంతా రాహుల్ వెంబడే వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ ఒంటరయ్యింది. అది దాదాపుగా మునుగోడులో మూడో స్థానానికి వస్తుంది. డౌట్‌లేదు. కానీ ఎన్ని ఓట్లు సాధిస్తుంది అనేది ఇంపార్టెంట్. మరీ తక్కువ ఓట్లు వచ్చాయి కదా అని కాంగ్రెస్‌ను తీసిపారేయడానికి లేదు. వచ్చే సాధారణ లేదా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా నే పోటీలో ఉంటుంది. బీజేపీ అనుకున్నంతగా అన్ని స్థానాల్లో బలం ప్రదర్శించలేదు.
ఉప ఎన్నికల్లో తొడలు చరిచి బరిలో నిలిచి గెలుప తీరాలకు చేరినంత మాత్రానా అంతటా ఇదే విధంగా పరిస్థితి ఉంటుందనుకోవడం పొరపాటే అవుతుంది. టీఆరెస్ వ్యతిరేక ఓటు ఇప్పటి వరకు బీజేపీ వైపు అనుకున్నారంతా కానీ, అక్కడ మోడీ పాలన, ఇక్కడ రాష్ట్ర నాయకులు అవగాహన రాహిత్యం, విషయం లేకుండా మాట్లాడటం, ప్రజల్లో తేలిపోవడం… కేవలం హిందుత్వమే నినాదం అనే కాన్సెప్టు దాన్ని బతికించలేవు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీను ఉండదు. కాంగ్రెస్‌కు ఒకటే భయం… గెలిచిన అభ్యర్థులు ఉంటారా..? పైలట్ రోహిత్ రెడ్డిల్లాగే జంప్ అవుతారా..? అని. అదే ప్రజల్లోనూ ఉంది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే దానికి అధికారం దక్కుతుందా..? గెలిపిస్తే వాళ్లంతా పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారా..? అనే అనుమాన బీజాలు పడటం ఆ పార్టీకి శాపంలా మారింది. దీన్ని గట్టెక్కగలిగి.. ప్రజల విశ్వాసం చూరగొనగలిగితే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తథ్యం. బీజేపీకి బలుపు కాదు… వాపేనని తేలిపోతుంది. మునుగోడు ఫలితం తర్వాత.. అంతా బీజేపీలో చేరుదామనే ఆలోచనలో ఉన్నారు. కానీ పరిస్థితి మారింది. కాంగ్రెస్‌లో చేరికలు ఉండొచ్చు. అందుకు తగ్గట్టుగా పార్టీ లో ఇంకా మార్పులు రావాలి.