ఎవరెన్ని చెప్పినా.. ఎంత ప్రలోభాలకు గురిచేసినా… ఇంతిస్తాం… అంతిస్తాం…. మాకే ఓటేయ్యండని బీజేపీ ఎంత ప్రలోభపెట్టినా… ఓటర్లు మొదటి నుంచి క్లారిటీతో ఉన్నారు. ప్రధానంగా టీఆరెస్‌కు రైతుబంధు, ఆసరా పింఛన్ల లబ్దిదారులే ఆదుకున్నారు. ఓటేశారు. ఒడ్డున పడేశారు. గెలుపు తీరాలకు చేర్చారు. మిగిలిన సెక్షన్లన్నీ అటూ ఇటూ పోయినా.. వీరు మాత్రం ఎటూ తల తిప్పలేదు. మదిలో మాట మార్చుకోలేదు. బ్లైండ్‌గా ఫిక్సయిపోయారు. క్షేత్రస్థాయిలో వాస్తవం వెబ్ మీడియా చేసిన సర్వేలో ఇదే తేలింది. ఇప్పుడు ఫలితాలు ప్రతిబింబించాయి. ప్రతీ ఇంటికీ ఆసరా పింఛన్ అందింది. రైతుబంధు వచ్చింది. రైతు బీమా కూడా తోడ్పాటునందించింది. అయితే రైతుబంధు, ఆసరా మాత్రమే టీఆరెస్‌ను ఆదుకున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిగిలిన ఫ్యాక్టర్స్ ఏమీ ఇందులో పనిచేయలేదు. లోకల్ డెవలప్‌మెంట్ కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. జాతీయ రాజకీయాలూ పట్టించుకోలేదు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లూ పెద్దగా డిస్కషన్ చేయలేదు. రైతుబంధు, ఆసరా పింఛన్లు…ఈ రెండే టీఆరెస్‌కు బ్రహ్మాస్త్రాలుగా నిలిచాయి. వీటికి తోడు కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు యాడ్ అయ్యింది. అందుకే టీఆరెస్‌కు 97, 334 ఓట్లు వచ్చాయి. 10, 040 ఓట్ల మెజారిటీ సాధించింది. బీజేపికి పడ్డ ఓట్లన్నీ కాంగ్రెస్‌వి, రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా వచ్చినవే. బీజేపీకి ఇక్కడ అంత సీన్‌లేదు. రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అని బీజేపీ ఇక్కడ 86వేల ఓట్లు సాధించింది. కానీ ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయి కదా అని బీజేపీ అది తన బలం అనుకుంటే పొరపాటే. మళ్లీ ఎన్నికల్లో దీనికి అంత సీన్ ఉండదు. కాంగ్రెస్ స్వయం కృతాపరాధం. పట్టించుకోలేదు. కనీసం పాల్వాయి ఆనాడు స్వతంత్రంగా పోటీ చేసి 27వేల ఓట్లు సాధిస్తే…ఇ ప్పుడు 21వేల ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయేటట్టు చేసుకున్నది. ఇది కచ్చితంగా నాయకుల వైఫల్యమే. బీఆరెస్‌కు ఇదే తొలిబోణి కావాలని కోరిన సీఎం కేసీఆర్ కోరికను మునుగోడు ప్రజలు తీర్చారు. మొత్తానికి ఇది అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా నిలవగా.. చారిత్రాత్మక ఉప ఎన్నికగా కూడా పేరు తెచ్చుకుంది. ఏది ఏమైనా మూడు పార్టీలు ఎవరికి వారే ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే వచ్చే ముందస్తు లేదా సాధారణ ఎన్నికల్లో ఇలాగే రిజల్టు ఉంటుందనేది పొరపాటు. చాలా మార్పులు వస్తాయి.