రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం
@@@
చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఒక సభకు కూడా చంద్రబాబు చేతికట్టుతోనే హాజరయి, జనం సానుభూతికోసం తెగ పరితపించారు. రోశయ్య కూడా చంద్రబాబు చేతికట్టు కనికట్టు మీద ఏదో జోక్ వేశారు.
చంద్రబాబునే ఆదర్శంగా తీసుకున్నారేమో మన బీజేపీ నాయకులు. ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసిన తరువాత కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పైకి లేవకపోవడంతో ఏదో ఒక అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఆసుపత్రులలో చేరిపోయి, సెలైన్లు, ఆక్సిజెన్ మాస్కులతో ఫోటోలు తీయించుకుని సానుభూతి కోసం ప్రాకులాడుతారు.
గతంలో బండి సంజయ్ కు లోక్ సభ ఎన్నికల సందర్భంలో వడదెబ్బ (వడ అంటే హోటళ్లలో అమ్మే మినప వడ కాదండోయ్) “తగిలించుకుని” దవాఖానలో రెస్ట్ తీసుకున్నారు. ఆ తరువాత రఘునందన్ రావు, ఈటల రాజేందర్ కూడా తాము పోటీ చేస్తున్నప్పుడు రకరకాల రోగాలతో ఆసుపత్రిలో చేరి విశ్రాంతి తీసుకున్నారు.
అదేమైనా శుభసంకేతంగా భావించారేమో తెలియదు…గత నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హఠాత్తుగా జ్వరం వచ్చేసింది. నాలుగురోజులనుంచి చలి వణికిస్తుంటే ఇప్పుడు జ్వరం ఏమిటి అని అడగొద్దు…మునుగోడులో ఎవరిని అడిగినా రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం అని కుండలు పగలగొట్టేసి చెబుతుండటంతో రాజగోపాలుడికి దడుపు జ్వరం వచ్చేసిందని జోకులు పేలుతున్నాయి. వెంటనే టి షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకుని ఆసుపత్రి బెడ్ మీద వొళ్ళు తెలియకుండా పడుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటోలు వైరల్ చేసేస్తున్నారు!
మరళీమోహన రావు ఇలపావులూరి