కేసీఆర్ పైకి కనిపించినంత ధైర్యవంతుడేమీ కాదు. గంభీరంగా కనిపించినంత మాత్రన నెమ్మదస్తుడేం కాదు. ఆయనకు ఆవేశం ఎక్కువ. ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేడు. ఎదిరిస్తే ఎగిరెగిరి పడుతడు. నిలదీస్తే నిప్పులు చెరుగుతడు. ఉనికిని దెబ్బతీసే యత్నం చేస్తే తొక్కి తోలు తీస్తడు. కాపాడుకున్న ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ఉప్పు పాతరేస్తడు. అవును.. ఇదంతా అందరూ చేసేదే కదా. కేసీఆర్ చేస్తే కొత్తేముంది? అందులో వింతేముంది? అనుకోవచ్చు కొందరు. కానీ కేసీఆర్ అంటే చాలా మంది చాలా మంచి అభిప్రాయం ఉంది. ఉద్యమ నేతగా, పరిపాలకుడిగా, ప్రజా సంక్షేమ నిర్మాతగా ఉన్నతంగా భావిస్తూ వచ్చారు.
అధికారమిచ్చి చూస్తే గానీ అసలు విషయం తెలియదు. దాన్నెలా కాపాడుకోవాలో.. ఎలా వినియోగించుకోవాలో. చాలా మంది ఇక్కడే బోల్తా కొడతారు. ఉల్టా పడతారు. అధికారాన్ని కాపాడుకునే క్రమంలో అసలు రంగు బయటపెడతారు. బయటపెట్టడం అనేకన్నా.. బయటపడటం అంటే కరెక్టేమో. ఎంత నిగ్రహశక్తి ఉన్నా.. ఎన్ని వందల పుస్తకాలు చదివినా.. కేసీఆర్ చాలా సందర్భాల్లో వెలితిగానే ప్రవర్తించాడు. ఆగ్రహంలో ఆలోచనలేని నిర్ణయాలెన్నో తీసుకున్నాడు. అధికారం కోసం నేలబారు విధానలెన్నో అవలంభించాడు. అంతిమంగా ఆయనకు కావాల్సింది అధికారం. దాన్ని కొనసాగించడం. దాని కోసం ఏదైనా చేస్తాడు. కొన్ని వెంటనే. మరికొన్ని కాలం కలిసొచ్చే వరకు.
ప్రతిపక్షాలను చావుదెబ్బ తీసి తన భుజాలు తనే చరుచుకున్న కేసీఆర్‌కు ఆ తర్వాత తెలిసొచ్చింది తను చేసిన తప్పిదమేమిటో. బీజేపీతో తర్వాత తలగోక్కోవడం చాలా కష్టమనిపించింది. అది చేసే నష్టం చాలా చికాకు తెప్పించింది. ప్రశ్నించే సమాజం తన ఎదుట ఉండొద్దు. అది ప్రతిపక్షమైనా మీడియా అయినా. మీడియా కోరలు పీకి చాలా రోజులుగా కేసీఆర్ నాగినీ డ్యాన్స్ ఆడిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. ఇక ప్రధాన మీడియా చతికిలబడి, నేలపై పాకుతూ .. ముక్కుతూ మూలుగుతూ కేసీఆర్ కోసమే మేమున్నదనే సత్యాన్ని గ్రహించి తమ జీవితాలకు అర్థం పరమార్థం తెలుసుకుని సార్థకత చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. కొత్తగా సోషల్ మీడియా ఒకటి పాపులరై కేసీఆర్‌కు మాచెడ్డ చిరాకు తెప్పిస్తున్నది.
ఆడెవడో రఘు అంట. ఆనిదో కొత్త దుకాణం. ఉండబుద్ది కాక చూసీ చూసీ ఓ సారి స్పాట్ పెడితే.. అది రివర్సయ్యింది. ఆ రఘుగాడు హీరో అయ్యి కూసున్నడు. తీన్మార్ మల్లన్న తాజాగా అరెస్టు. అదను కోసం చూశారు. వీనికీ స్పాట్ పెట్టారు. కానీ పెద్ద సారు ఓపికను మెచ్చుకోవాలె. ఇన్ని రోజులు ఆగాడు. కాలంబు రాగానే కాటేసి తీరాలె అని కాళోజీ అన్నట్టు ఇప్పడు కాటేసిండన్నమాట. కానీ మలన్నకు అంత సీనుందా? పిచ్చడోర్రినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడతడు .. సరే. నోటి తీట బాగా ఉన్నది, అదీ సరే. ఎట్ల పడితే అట్ల ఎవల్ని బడితే ఆళ్లను తిడున్నడు.
అవును.. ఇది పద్దతి కాదు. అయితే…. జనాలే వాణ్ని ఈసడించుకుంటరు కదా. మనకెందుకు? అంత మంది పోలీసులు.. మంది మార్బలం… మళ్లీ ఇంకొకడ్ని హీరో చేయవట్టె కేసీఆర్. ఇప్పటికే కేసీఆర్ పేరు వాడుకొని తిట్టీ తిట్టీ ఫేమస్ అయ్యిండు. ఇప్పుడింకింత ఫేమస్ చేద్దామనా? మీకెవరు చెప్తున్నరో ఏందో…? పెద్ద వ్యూహ రచన చేస్తరు. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పడినట్టు. కొండతొవ్వి ఎలుకను పట్టినట్టు. దీని వెనుక ఆ వ్యూహకర్త ఎవరో? పాపం.
అవునూ .. కేసీఆర్ సారు. మీరు మొన్నొక మాటన్నరు బాగా నచ్చింది.
ఏనుగు పోతుంటే.. కుక్కలు మొరుగుతయని. మరి ఇసుంటి కుక్కలకు మీరు భయపడటమా?
ఈ ఐరావతానికి వణకా?
కాదా? మరెందుకు లైట్ తీస్కో .. వాళ్ల పాపాన వాళ్లు పోతరు.
