క‌రోనా వేళ ఈ ప‌త్రిక‌ల క‌ర్క‌శ హృద‌యాలు క‌ర‌గ‌లేదు. ఓవైపు వైర‌స్ ప్రాణాలు మింగుతుంటే ఏ మాత్రం ప‌ట్టింపు లేకుండా.. క‌నీసం మాన‌వ‌త్వం చూప‌కుండా మెడ‌లు ప‌ట్టి గెంటేసిన ఘ‌న చ‌రిత్ర తెలుగు ప్రింట్ మీడియాది. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ సంస్థ వేలిప‌ట్టుకొని న‌డిచి, దాన్ని వేళ్ళూనుకునేలా చేసిన విలేక‌రుల‌ను వ‌దిలించుకున్నారు. క‌రోనాకు బ‌లి పెట్టారు. బ‌లిప‌శువుల‌ను చేశారు. ఒక్క మీడియా అని కాదు.. అన్నీ. ఈనాడుతో మొద‌లుపెడితే ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఆఖ‌రికి న‌మ‌స్తే తెలంగాణ‌.

ఈనాడు లాంటి పాతుకుపోయిన వ్య‌వ‌స్థే క‌రోనాకు అత‌లాకుత‌ల‌మైతుంటే మేమేంత అంటూ ఇవ‌న్నీ వ‌రుస‌క‌ట్టాయి. పోటీలు ప‌డి విలేక‌రుల పీక‌లు కోశాయి. స‌బ్ ఎడిట‌ర్ల‌ను ప‌ట్ట‌ప‌గ‌లు చంపేశాయి. ఎవ‌రికి చెప్పుకుంటారో చెప్పుకోండ‌ని కింద సెక్యూరిటీ గార్డును దాటి లోనికి రానీయలేదు. చూశావా.. నేనంత‌ భారం త‌గ్గించానో? అని ఆ ఎడిట‌ర్లు మేనేజ్‌మెంట్ల ద‌గ్గ‌ర కాల‌ర్లు ఎగ‌రేశారు. రెండో వేవ్‌లో మ‌రి కొంద‌రిని బ‌లి పెట్టారు. ఇప్పుడు థ‌ర్డ్‌వేవ్ కోసం మ‌రి కొంత మందిని బ‌లి చేసేందుకు దాహార్తి ముఖాల‌తో ఎదురుచూస్తున్నారు. ఇది నేటి తెలుగుదిన ప‌త్రిక‌ల ప‌రిస్థితి.

ఈ జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాత వేళ్ల మీద లెక్క‌పెట్టే ఉద్యోగుల‌తో స‌రిపెట్టుకొని అంద‌రినీ గేట‌వ‌త‌ల‌కి నూకేసేందుకు ప్లానింగ్లు రెడీ చేసుకుని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు స్టేట్ బ్యూరోలో రిపోర్ట‌ర్ల కొర‌త ఏర్ప‌డింది. చేసిన పాపం త‌గ‌ల‌క మాన‌దు క‌దా! జ‌ర్న‌లిజాన్ని అడుగు ప‌ట్టించి అడుక్కు తినేలా చేసిన ఈ పెద్ద మ‌నుషుల‌కు ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌లు కావాలి. బాగా అనుభ‌వం గ‌డించి ఉండాలి. బానిసలా ప‌నిచేయాలి. అలాంటి వాళ్లు కావాలి, దొర‌క‌డం లేదు. అందుకే ఇలా దండోరా కొట్టాల్సి వ‌స్తుంది.

మొన్నామధ్య సాక్షి మెయిన్ పేజీలో చీఫ్ స‌బ్ ఎడిట‌ర్ కావాలి అంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చుకున్నారు. దాని దైన్య‌స్థితికి ఇది అద్ధం ప‌డుతుంది. అధికార పార్టీ ప‌త్రిక అయ్యుండి కూడా న‌మ‌స్తే తెలంగాణ రిపోర్ట‌ర్ల‌ను, స‌బ్ ఎడిట‌ర్ల‌ను పీకేయ్య‌డంలో మిగిలిన వాటిక‌న్నా దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఆ ఎండీ వ‌ద్ద కొత్త ఎడిట‌ర్ ప్ర‌శంస‌లందుకున్నాడు. ఇవేమీ కేసీఆర్‌కూ, కేటీఆర్‌కూ ప‌ట్ట‌వు. ఎవ‌రు ప‌ట్టించుకోక ఆఖ‌రికి జ‌ర్న‌లిజాన్ని అధోగ‌తి పాలుచేసి త‌మ ప‌రువును మ‌రింత దిగ‌జార్చుకున్నారు. మీడియా విలువ‌ల‌ను పాతాళానికి తొక్కిపెట్టి మ‌ళ్లీ లెవ్వ‌కుండా సిమెంట్‌తో గ‌ట్టి స‌మాధి క‌ట్టారు.